14/05/2021

కోహ్లీ కంటి దగ్గర గాయం… అభిమానుల్లో ఆందోళన!

14వ సీజన్ ఐపీఎల్ పోటీలు శుక్రవారం ప్రారంభంకాగా, తొలి మ్యాచ్ లో నిరుటి చాంపియన్ ముంబై ఇండియన్స్ ను ఢీకొన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు, చివరి బాల్ వరకూ ఆడి, విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ముంబై జట్టు తన ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. 19వ ఓవర్ తొలి బాల్ ను వేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

కృనాల్ పాండ్యా కొట్టిన బంతిని క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించిన కోహ్లీ కంటి దగ్గర బాల్ తాకింది. తొలుత చేతిని తాకిన బాల్, ఆపై నుదుటిపై కుడికన్ను సమీపంలో తాకింది. ఆపై కోహ్లీ కొన్ని క్షణాలు విలవిల్లాడినా, తన జట్టు గెలుపు కోసం మైదానాన్ని వీడకుండా ఫీల్డింగ్ చేశాడు. కోహ్లీ ముఖంపై తగిలిన దెబ్బ కారణంగా, అతని కన్ను ఎర్రగా మారిపోయింది. కంటి నుంచి నీరు కారుతూ కూడా కనిపించింది. దీంతో బెంగళూరు అభిమానులు ఆందోళనకు గురయ్యారు.

ఎంఐ ఇన్నింగ్స్ ముగిసిన తరువాత నవ్వుకుంటూనే పెవిలియన్ కు వెళ్లిన కోహ్లీ, ఆపై బ్యాటింగ్ కు వచ్చాడు. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు విధించిన 160 పరుగుల విజయలక్ష్యాన్ని చివరి బంతికి ఆర్సీబీ ఛేదించి, ఐపీఎల్ ప్రస్తుత సీజన్ లో తొలి విజయాన్ని నమోదు చేసుకుని, రెండు పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. కోహ్లీ కన్ను ఎర్రబడటం, కంటి నుంచి నీరు కారుతున్న ఫొటోలు, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: