14/05/2021

ఇసుకలో సమాధి అయిన 3 వేల ఏళ్ల నాటి నగరం.. ఇప్పటికీ చెక్కు చెదరలేదు!

అది 3 వేల ఏళ్ల నాటి అతి పురాతన నగరం. ఇసుక కింద సమాధి అయిపోయింది. ఎన్నో దేశాలకు చెందిన ఎంతో మంది పురాతత్వ శాస్త్రవేత్తలు ఎన్నో తవ్వకాలు చేపట్టినా.. ఆ నగరాన్ని గుర్తించలేకపోయారు. కానీ, ఈజిప్ట్ సైంటిస్టులు తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. అంతేకాదు.. ఆ నగరంలోని కొన్ని అద్భుత ఘట్టాలను వెలికితీయగలిగారు. ఆ నగరం పేరు ‘అటెన్’.


అన్ని వేల ఏళ్లవుతున్నా ఆ నగరపు గోడలు చెక్కు చెదరని స్థితిలో ఉన్నాయి. బేకరీ, సమాధులు, నివాస సముదాయాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. టుటెంకమిన్ సమాధిని గుర్తించిన తర్వాత.. అతి ముఖ్యమైన వెలికితీత ఇదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దానికి సంబంధించిన వివరాలను ప్రముఖ చరిత్రకారుడు, పురాతత్వ శాస్త్రవేత్త జాహీ హవాస్ వెల్లడించారు. ఆయన ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తల బృందం ఈ నగరాన్ని గుర్తించింది.


రాజుల లోయగా పిలిచే లగ్జర్ కు దగ్గర్లో గుర్తించినట్టు చెప్పారు. ఎమెనోటెప్ 3 కాలానికి చెందినదని వెల్లడించారు. ఈజిప్ట్ లో ఇప్పటిదాకా గుర్తించిన పురాతన నగరాల్లో ఇదే అతిపెద్దదని శాస్త్రవేత్తలు చెప్పారు. దాదాపు ఏడు నెలల పాటు సాగిన తవ్వకాల్లో నగరంతో పాటు ఎన్నో ఆభరణాలు, బీటిల్ పురుగులకు సంబంధించిన ఆనవాళ్లు, మట్టి ఇటుకలను వెలికి తీశారు. ఆ ఇటుకలపై ఎమెనోటెప్ 3 చిత్రాలు ముద్రించి ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. నివాస సముదాయాల్లోని ఇళ్లలో ప్రజలు నిత్యం వాడే పనిముట్లు, మట్టి పొయ్యిలు, కుండలు, పూలు పెట్టుకునే వాజులు, నాటి మనుషుల అస్థిపంజరాలను గుర్తించారు.


ఎన్నో దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపినా.. ఈ నగరాన్ని గుర్తించలేకపోయారని పురాతత్వ శాఖ మాజీ మంత్రి కూడా అయిన హవాస్ వెల్లడించారు. గత ఏడాది సెప్టెంబర్ లో రామ్సెస్ 3, ఎమెనోటెప్ 3కి సంబంధించిన గుళ్ల మధ్య తవ్వకాలు మొదలుపెట్టామన్నారు. కేవలం వారం వ్యవధిలోనే నగరాన్ని గుర్తించామన్నారు. చాలా చోట్ల ఇటుకలతో కూడిన నిర్మాణాలు బయటకు కనిపించాయని, తవ్వకాలను మరింత చేపట్టగా నగరం వెలుగులోకి వచ్చిందని అన్నారు.

కాగా, యూఫ్రేట్స్ నుంచి సూడాన్ వరకు ఎమెనోటెప్ 3 పాలించాడని, క్రీస్తు పూర్వం 1354లో చనిపోయాడని చరిత్రకారులు చెబుతుంటారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఆ ప్రాంతాన్ని పాలించాడని, ఎన్నో కట్టడాలను నిర్మించాడని అంటారు. లగ్జర్ కు సమీపంలో ఎమెనోటెప్ 3, అతడి భార్యకు సంబంధించిన రెండు భారీ రాతి విగ్రహాలను నిలబెట్టించాడు. దానినే కొలోజీ ఆఫ్ మెమ్నన్ అని పిలుస్తుంటారు.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: