14/05/2021

అమెరికాలో భారత దంపతుల అనుమానాస్పద మృతి.. పరస్పరం పొడుచుకున్నారంటూ కథనాలు!

తన తల్లిదండ్రులు చనిపోయారని పాపం ఆ చిన్నారికి తెలియదు. మమ్మీ..డ్యాడీ అని ఎంత పిలిచినా పలకలేదు.. తట్టి లేపినా లేవలేదు.. ఏం చేయాలో కూడా తెలియని వయసు ఆ చిన్నారిది. బాల్కనీలోకి వచ్చి వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ చిన్నారి ఏడుపు విని ఇరుగు పొరుగు వారు వచ్చి ఇంట్లో చూస్తే ఆ చిన్నారి తల్లిదండ్రులు రక్తపు మడుగులో చనిపోయి కనిపించారు. ఈ ఘటన అమెరికాలోని న్యూజెర్సీలో జరిగింది.

చనిపోయిన వారిని మహారాష్ట్ర బీడ్ జిల్లాలోని అంబాజోగైకి చెందిన బాలాజీ రుద్రావర్ (32), ఆరతి (30)గా గుర్తించారు. ఐటీ ఉద్యోగి అయిన బాలాజీ 2015 ఆగస్టులో అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. న్యూజెర్సీలోని నార్త్ అర్లింగ్టన్ లోని రివర్ వ్యూ గార్డెన్స్ లో ఉన్న 21 గార్డెన్ టెర్రెస్ లో ఉంటున్నారు. అయితే, బుధవారం వారి కూతురు వెక్కి వెక్కి ఏడుస్తుండడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి చూడగా అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించారు.

వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. గురువారం బాలాజీ తండ్రికి సమాచారం అందించారు. వారి మృతదేహాలను భారత్ కు తీసుకురావడానికి మరో 8 నుంచి 10 రోజులు పట్టే అవకాశముంది. కాగా, ఆరతి ఏడు నెలల గర్భవతి అని, తమ కుటుంబం చాలా సంతోషంగా గడిపేదని బాలాజీ తండ్రి భరత్ రుద్రావర్ చెప్పారు. వారి మృతిపై ఇంకా స్పష్టత రాలేదన్నారు. ప్రస్తుతం తన మనుమరాలు తన కుమారుడి స్నేహితుల వద్ద ఉందని ఆయన చెప్పారు.

ఒకరినొకరు పొడుచుకున్నారా?

అనుమానాస్పద మృతిగా అమెరికా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నా.. అక్కడి వార్తా చానెళ్లు మాత్రం ఒకరినొకరు పరస్పరం పొడుచుకుని చనిపోయారని కథనాలు ప్రసారం చేస్తున్నాయి. హాల్ లో భార్యాభర్తలు ఇద్దరు గొడవపడ్డారని, ఈ క్రమంలో ఆరతిని బాలాజీ కడుపులో పొడిచాడని వార్తా కథనాలు పేర్కొన్నాయి. తర్వాత ఆరతి కూడా తన భర్తను పొడిచేసిందని వెల్లడించాయి. అయితే, పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తేగానీ వారి మృతికి సంబంధించిన వివరాలు పూర్తిగా తెలియవని అధికారులు చెబుతున్నారు.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: