17/04/2021

బయటకు లీకైన డిజిటల్​ కంటెంట్​ ముసాయిదా నిబంధనలు!

డిజిటల్ కంటెంట్, ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి ఓటీటీ, వార్తా సైట్ల నియంత్రణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (సంస్థలు, డిజిటల్ మీడియా విలువల కోడ్) నిబంధనలు 2021ను తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే. భారత సార్వభౌమత్వం, సమగ్రతను దెబ్బతీసే, దేశ భద్రతకు ముప్పుగా పరిణమించే డేటా ప్రసారంపై ఆ చట్టం ద్వారా నిషేధం విధించనుంది. అయితే, ఆ చట్టం ఎలా ఉండబోతోంది? దానిలోని ముసాయిదా నిబంధనలు ఏంటి? అన్నది బయటకు లీకయ్యాయి. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.

ముసాయిదా నిబంధనల ప్రకారం రక్షణ, విదేశాంగ, హోం, సమాచార ప్రసార, న్యాయ, ఐటీ, మహిళా శిశు అభివృద్ధి శాఖలకు చెందిన ప్రతినిథులతో కమిటీని ఏర్పాటు చేస్తారు. కోడ్ ను ఉల్లంఘించినట్టు తేలితే సుమోటాగా దానిపై విచారణ జరిపే హక్కు కమిటీకి ఉంటుంది. అలాంటి కంటెంట్ ను బ్లాక్ చేసేందుకు జాయింట్ సెక్రటరీ లేదా ఆపై హోదా ఉన్న అధికారిని ‘ఆథరైజ్డ్ ఆఫీసర్’గా నియమించనుంది.

ముసాయిదాలోని కొన్ని నిబంధనలు…

  • పరువుకు భంగం కలిగించే, అసభ్య, వివక్షా పూరితమైన, మైనర్లకు హానికరమైన, దేశ సార్వభౌమత్వం, రక్షణ, భద్రత, సమైక్యతకు ముప్పు కలిగించే కంటెంట్ పై నిషేధం.
  • నేరపూరితమైన లేదా అక్రమమైన కంటెంట్ అని తమ దృష్టికి వచ్చిన 36 గంటల్లో లేదా కోర్టు ఆర్డర్ ప్రకారం ఆ పోస్టులను సోషల్ మీడియా సైట్లు తొలగించాలి.
  • ఓ చెడు సందేశాన్ని ముందు ఎవరు సృష్టించారో సోషల్ మీడియా సైట్లే నిర్ధారించాలి.
  • ఫిర్యాదు వచ్చిన 72 గంటల్లో సైట్లు, సోషల్ మీడియా సంస్థలు ప్రభుత్వ అధీకృత సంస్థకు వెంటనే సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.
  • ఫిర్యాదులను నెలలోపు పరిష్కరించేందుకు ఓ గ్రీవెన్స్ ఆఫీసర్ ను సంస్థలే నియమించాలి.
  • ఫిర్యాదు చేసిన 24 గంటల్లో అక్రమమైన లేదా నేరపూరితమైన కంటెంట్ ను ఇంటర్మీడియరీలు (వార్తా సంస్థలు, ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి ఓటీటీలు) తొలగించాలి.
  • కోడ్ ఆఫ్ ఎథిక్స్ అమలుకు మూడు దశల వ్యవస్థ ఏర్పాటు. స్వీయ నియంత్రణ, స్వీయ నియంత్రణ సంస్థల అధీనంలో స్వీయ నియంత్రణ, ప్రభుత్వ నియంత్రణ వ్యవస్థలు.
  • కోడ్ ఆఫ్ ఎథిక్స్ కు సంబంధించి ఏవైనా ఉల్లంఘనలు జరిగితే ప్రభుత్వానికి ప్రజలు ఫిర్యాదు చేసేలా ఆన్ లైన్ పోర్టల్ ఏర్పాటు
  • 15 రోజుల్లోగా సమస్యల పరిష్కారం

 

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: