22/04/2021

కొకైన్ తో పట్టుబడిన బెంగాల్ బీజేపీ మహిళా నేత… మీడియా ఎదుట కైలాశ్ విజయ్ వర్గియా పేరు చెబుతూ కేకలు!

బెంగాల్ రాజధాని కోల్ కతాలో బీజేపీ యువమోర్చా కార్యదర్శిగా పని చేస్తున్న పమేలా గోస్వామి 100 గ్రాముల కొకైన్ తో పట్టుబడటం సంచలనం కలిగించగా, ఆమె బీజేపీ జాతీయ కార్యదర్శి కైలాశ్ విజయ్ వర్గియాకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న రాకేశ్ సింగ్ ఈ కేసులో ప్రధాన నిందితుడని మీడియా ముందు కేకలు పెట్టడం మరింత సంచలనమైంది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, తన సహచరుడు, యువమోర్చా నేత ప్రబీర్ కుమార్ దేవ్ తో కలసి పమేలా గోస్వామి కారులో వెళుతుంటే, పోలీసులు ఆపి కారును సోదా చేశారు.

ఆ సమయంలో సీటు కింద కొన్ని లక్షల విలువైన కొకైన్ పట్టుబడింది. ఆపై అమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు, స్థానిక కోర్టులో ప్రవేశపెట్టారు. ఆపై ఆమె బయటకు రాగానే, మీడియా ఆమెను చుట్టుముట్టింది. ఆ సమయంలో పెద్దగా కేకలు పెట్టిన ఆమె, బీజేపీ స్వయంగా తనను ఈ కేసులో ఇరికించాలని ప్రయత్నిస్తోందని ఆరోపించింది. తనను ఇరికించిన వారిలో బీజేపీ రాష్ట్ర ఇన్ చార్జ్ కూడా ఉన్నారని, వ్యాఖ్యానించింది. ఈ కేసును ఇప్పుడు బెంగాల్ సీఐడీ (క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్) విచారించాలని కూడా ఆమె డిమాండ్ చేశారు.

తనను ఇరికించిన కైలాశ్ విజయ్ వర్గియా, రాకేశ్ సింగ్ లను వెంటనే అరెస్ట్ చేసి, నిజానిజాలను బయటకు తీయాలని డిమాండ్ చేసిన ఆమె, కోర్టులో మాత్రం ఈ వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం. ఈ విషయంలో స్పందించిన బీజేపీ నేత సామిక్ భట్టాచార్య, విచారణ అనంతరం కేసులో అసలు నిందితులు ఎవరో తేలుతుందని వ్యాఖ్యానించారు. కేసును విచారిస్తున్న పోలీసులు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో పని చేస్తున్నారని, వారు దీన్ని ఎలాగైనా తిప్పగలరని వ్యాఖ్యానించడం గమనార్హం.

ఇదే విషయమై స్పందించిన తృణమూల్ కాంగ్రెస్ నేత చంద్రిమ, బెంగాల్ లో ఇటువంటి ఘటనలు జరుగుతుండటం సిగ్గుచేటని, బీజేపీ అసలైన స్వభావం ఈ కేసుతో బయటపడిందని, గతంలో చిన్నారులను అక్రమంగా రవాణా చేసిన కేసులోనూ ఆ పార్టీ నేతలు అరెస్ట్ అయ్యారని గుర్తు చేశారు.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: