22/04/2021

ఎక్కడ పడితే అక్కడ.. ఎప్పుడు పడితే అప్పుడు నిరసనలు చేయకూడదు: షహీన్​ బాగ్​ నిరసనలపై సుప్రీం కోర్టు

నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, అయితే దానికంటూ కొన్ని హద్దులున్నాయని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఎక్కడ పడితే అక్కడ.. ఎప్పుడు పడితే అప్పుడు నిరసనలు చేయకూడదని స్పష్టం చేసింది. పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ)కి వ్యతిరేకంగా 2019లో ఢిల్లీలోని షహీన్ బాగ్ వద్ద ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే.

నిరసనకారులు రహదారి మొత్తాన్ని ఆక్రమించి రోజుల తరబడి ఆందోళనలు చేశారు. అయితే, దీనిపై గత ఏడాది సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. షహీన్ బాగ్ ఆందోళనలు అక్రమమని పేర్కొంది. కోర్టు ఆదేశాలపై 12 మంది స్వచ్ఛంద కార్యకర్తలు రివ్యూ పిటిషన్ వేశారు.

ఈ పిటిషన్ ను జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం పొద్దుపోయాక విచారించింది. ‘‘ఎక్కడపడితే అక్కడ.. ఎప్పుడు పడితే అక్కడ నిరసనలు చేసే హక్కు లేదు. ఎవరికైనా ఆందోళనలు చేసే హక్కు ఉంటుంది. అప్పటికప్పుడు అవి జరిగిపోవాలి తప్ప.. దీర్ఘకాలం పాటు ఆ అసమ్మతి గళాన్ని వినిపించకూడదు. ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా బహిరంగ స్థలాలను ఆక్రమించకూడదు. నిరసన హక్కులంటూ ప్రజల హక్కులను హరించరాదు’’ అని ధర్మాసనం పేర్కొంది.

నిరసనలు చేయడానికంటూ కొన్ని ప్రాంతాలున్నాయని, అక్కడ ఆందోళనలు చేసుకోవచ్చని, అంతేగానీ బహిరంగ స్థలాలను ఆక్రమించరాదని తేల్చి చెప్పింది. కాగా, ప్రజాస్వామ్యంలో అసమ్మతి ఉండడం సహజమని గత ఏడాది అక్టోబర్ లో ఇచ్చిన ఆదేశాల్లో సుప్రీం కోర్టు పేర్కొంది. అయితే, ప్రజల రోజువారీ జీవితాలకు అడ్డు తగిలేలా నిరసనలు ఉండకూడదని అప్పుడూ చెప్పింది. కాగా, షహీన్ బాగ్ లో దాదాపు 3 నెలల పాటు సీఏఏ వ్యతిరేక ఆందోళనలు జరిగాయి.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: