07/05/2021

స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలవుతున్నా లక్షలాది మంది అస్సామీలకు భూములు లేవు: ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అసోంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం బీజేపీకి కొత్త జోష్ ఇచ్చింది. శనివారం ఆయన అసోంలోని శివసాగర్ లో సభ నిర్వహించారు. 1.06 లక్షల మందికి భూ పట్టాలు పంపిణీ చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా లక్షలాది మంది ఆదివాసీలు, స్థానిక తెగల కుటుంబాలకు స్థల యాజమాన్య హక్కులే లేవని ఆవేదన వ్యక్తం చేశారు.

అసోంలో బీజేపీ అధికారంలోకి వచ్చేనాటికి 6 లక్షల మంది ప్రజలకు భూములు లేవని, వాళ్లకు పట్టాలు ఇవ్వలేదని ప్రధాని అన్నారు. అలాంటి వాళ్లందరికీ సోనోవాల్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందని గుర్తు చేశారు. నిన్నటిదాకా 2.25 లక్షల మంది భూమి లేని పేదలకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందని, వారికి తోడుగా ఇప్పుడు మరో లక్ష మందికిపైగా నిరుపేదలకు భూములు ఇచ్చిందని కొనియాడారు. కేంద్రం, రాష్ట్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రతి ఇంటికీ మంచినీరు అందించేలా చర్యలు తీసుకుంటోందన్నారు.

‘‘అసోంను అన్ని విధాలా వేగంగా అభివృద్ధి చేయడం మాకు చాలా ముఖ్యం. ప్రజల ఆత్మవిశ్వాసంతో ఆత్మనిర్భర్ భారత్ సాకారమవుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా అసోంలోని 40 శాతం మంది లబ్ధి పొందుతున్నారు’’ అని ప్రధాని అన్నారు. అసోం సంస్కృతిని కాపాడేందుకు ఎన్డీయే ప్రభుత్వం కృషి చేస్తోందని, అందుకు అనుగుణంగా పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. అసోం భాష, సాహిత్యాల రక్షణకు కట్టుబడి ఉన్నామన్నారు.

కరోనా కట్టడిలో ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించిందని సీఎం శర్బానంద సోనోవాల్ ను ప్రధాని ప్రశంసించారు. కరోనా టీకా పంపిణీనీ అదే విధంగా ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. అందరూ తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. ఆ మహనీయుడి జయంతిని పరాక్రమ్ దివస్ గా జరుపుతున్నామని చెప్పారు. ఇప్పటికీ ఆయన జీవితం అన్ని తరాలకూ స్ఫూర్తినిస్తుందన్నారు.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: