14/05/2021

క‌రోనా జ‌న్యు మార్పుల‌తో ప్ర‌మాదం పొంచి ఉంది: శాస్త్ర‌వేత్త‌ల హెచ్చరిక

క‌రోనా వ్యాక్సిన్లు కొన్ని అందుబాటులోకి వ‌స్తున్న‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం అత్య‌వ‌స‌ర వినియోగానికి మాత్ర‌మే వాటిని వాడుతోన్న విష‌యం తెలిసిందే. మ‌రోవైపు, ప్రపంచవ్యాప్తంగా కరోనా వైర‌స్ కేసులు ప్ర‌తిరోజు ల‌క్షల్లో పెరిగిపోతున్నాయి. వ్యాక్సిన్లు ప్ర‌జ‌లంద‌రికీ అంద‌డానికి కొన్ని నెల‌ల స‌మ‌యం పట్టచ్చు.

అయితే, ఈ ఆల‌స్యంలోనే క‌రోనా త‌న ప‌ని తాను చేసుకుంటూ వెళ్తోంది. వైరస్‌లో వేగంగా కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీనిపై శాస్త్ర‌వేత్త‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప్రజలకు వ్యాక్సిన్ వేయడంలో ఆల‌స్యం జ‌రిగితే కొత్త రకాల క‌రోనా వైర‌స్ లు పెరిగే అవ‌కాశం పెరుగుతుంద‌ని చెప్పారు.

ప్ర‌స్తుతం అభివృద్ధి చెందుతోన్న వ్యాక్సిన్లు ఇప్ప‌టి వ‌ర‌కు వెలుగులోకి వ‌చ్చిన‌ అన్ని ర‌కాల క‌రోనా వైర‌స్‌ల‌కు ప‌ని చేసే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ వ్యాక్సిన్ల‌తో పాటు ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న‌ చికిత్స‌ల‌కూ న‌యం కాని కొత్త ర‌కం వైర‌స్ కూడా వ‌చ్చే అవ‌కాశం లేక‌పోలేద‌ని అంటున్నారు.

ఇప్ప‌టికే కొత్త స్ట్రెయిన్ కొవిడ్-19 కంటే 10 రెట్లు వేగంగా విస్త‌రిస్తోంద‌ని గుర్తు చేశారు. ఏ మాత్రం జాప్యం చేయ‌కుండా వ్యాక్సిన్లు వేయాల‌ని, క‌రోనా క‌ట్ట‌డి జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల‌ని చెబుతున్నారు. లేదంటే కరోనా వైరస్‌లో చోటు చేసుకుంటోన్న‌ జన్యు మార్పులు కొత్త స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తాయ‌ని హెచ్చ‌రిస్తున్నారు.

కరోనా వైరస్‌ను మరింత ప్రమాదకరంగా మార్చే మార్పు ఎప్పుడైనా రావచ్చని శాస్త్రవేత్త పార్డిస్‌ సబేటి తెలిపారు. ఒక్క మార్పు వల్ల పరిస్థితి మొత్తం మారిపోయే ప్రమాదం ఉందన్నారు.  2014లో ఎబోలా విజృంభణ సమయంలోనూ ఆ వైరస్‌లో వచ్చిన  ఒక్క మార్పుతో పరిస్థితి ప్రమాదకరంగా మారింద‌ని అప్ప‌ట్లో స‌బేటి తేల్చారు.

కొత్త క‌రోనా రకాలను గుర్తించేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ  కూడా శాస్త్ర‌వేత్తల‌ను కోరింది. బ్రిటన్ లో వెలుగు చూసిన కొత్త స్ట్రెయిన్ ఈ ఏడాది మార్చిలోపు  అమెరికాలో అత్య‌ధికంగా క‌న‌ప‌డుతుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు అంచ‌నా వేశారు.

ఈ స్ట్రెయిన్ వ‌ల్ల‌ తీవ్ర అనారోగ్యం తలెత్తే ప్ర‌మాదం లేన‌ప్ప‌టికీ అది  చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందన్నారు. స్ట్రెయిన్ ఇప్ప‌టికే 30 దేశాలకు విస్తరించిందని , క‌రోనా క‌ట్ట‌డికి  సాధ్యమైనన్ని చర్యలను కొనసాగిస్తూనే ఉండాల‌ని హార్వర్డ్‌ వర్సిటీ నిపుణుడు మైఖేల్‌ మినా తెలిపారు. కొత్త రకం కరోనా వైరస్‌లు ప్ర‌స్తుతం ఉన్న చికిత్స‌ల‌కు లొంగ‌క‌పోవ‌చ్చ‌ని కొన్ని ల్యాబ్‌ ప్రయోగాలు సూచిస్తున్నాయి.

బహుళ యాంటీబాడీలతో చికిత్స చేయడం వల్ల ప్రయోజనం ఉండొచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. వైరస్‌లో మార్పుల వల్ల రీఇన్‌ఫెక్షన్లు పెరగొచ్చని తెలిపారు. ప్ర‌పంచ వ్యాప్తంగా వేస్తోన్న క‌రోనా వ్యాక్సిన్లు సమర్థంగానే పనిచేస్తున్నాయని యూతా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త ఆండ్రూ పావియా అన్నారు. భ‌విష్య‌త్తులో వైరస్‌లో భారీగా జన్యు మార్పులు చోటుచేసుకుంటే వ్యాక్సిన్ ఫార్ములాలో మార్పు చేయాల్సి ఉంటుందని తెలిపారు.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: