22/04/2021

కరోనా సోకితే మొదట్లోనే ఈ లక్షణం కనిపిస్తుందంటున్న స్పెయిన్ పరిశోధకులు

ఓవైపు కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను చుట్టేస్తుండగా, మరోవైపు ఆ వైరస్ గుట్టుమట్లు తెలుసుకునేందుకు ముమ్మరస్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా స్పెయిన్ పరిశోధకులు ఆసక్తికర వివరాలు వెల్లడించారు. కరోనా సోకిన వ్యక్తిలో మొదట మానసిక గందరగోళం (డెలీరియం) ఏర్పడుతుందని గుర్తించారు.

కరోనా పాజిటివ్ రోగిలో ఆరంభదశలో జ్వరంతో పాటు మానసిక అసమతుల్యత ఏర్పడుతుందని స్పెయిన్ లోని ఒబెర్టా డి కాటలోనియా యూనివర్సిటీకి చెందిన జేవియర్ కొర్రియా తెలిపారు. ఈ లక్షణం ఎక్కువగా పెద్ద వయసు వారిలో కనిపిస్తుందని పేర్కొన్నారు.

సాధారణంగా కరోనా అనగానే వాసన తెలుసుకోలేకపోవడం, రుచి కోల్పోవడం, జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి ప్రాథమిక లక్షణాలుగా భావిస్తుండగా, కొందరిలో డెలీరియం లక్షణాలు కూడా కనిపిస్తున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయనం తాలూకు వివరాలు క్లినికల్ ఇమ్యూనాలజీ, ఇమ్యూనోథెరపీ జర్నల్ లో ప్రచురితమయ్యాయి.

పెద్ద వయసు వారిలో జ్వరంతోపాటు మానసిక గందరగోళం కూడా ఏర్పడితే కరోనా వైరస్ బారిన పడ్డారన్నదానికి ప్రాథమిక సంకేతమని పరిశోధకులు తెలిపారు. డెలీరియం పరిస్థితికి గురైన వ్యక్తిలో వాస్తవాన్ని గుర్తించే శక్తి ఉండదని, భ్రాంతులు కలుగుతుంటాయని జేవియర్ కొర్రియా తెలిపారు. కరోనా వైరస్ అన్ని కీలక అవయవాలపై ప్రభావం చూపడంతో పాటు కేంద్ర నాడీ వ్యవస్థను కూడా దెబ్బతీస్తున్నట్టు తాజా పరిశోధన ద్వారా వెల్లడైంది.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: