చినజీయర్ స్వామికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆత్మీయ పరామర్శ

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రిదండి చినజీయర్ స్వామికి ఫోన్ చేశారు. మాతృవియోగం పొందిన చినజీయర్ ను వెంకయ్యనాయుడు ఫోన్ ద్వారా ఆత్మీయంగా పరామర్శించారు. చినజీయర్ స్వామి మాతృమూర్తి  పరమపదించిన సంగతి తెలసిందే. ఈ ఘటనపై ఈ ఉదయం చినజీయర్ తో మాట్లాడిన వెంకయ్యనాయుడు తన సంతాపం తెలియజేశారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి కార్యాలయం ఓ ప్రకటన వెలువరించింది.

చినజీయర్ స్వామిలో ధార్మిక, సామాజిక దృష్టి కోణం ఏర్పడడానికి మాతృమూర్తి మంగతాయారు పాత్ర ఎంతో ఉందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నట్టు ఆ సందేశంలో తెలిపారు. సంప్రదాయ మధ్యతరగతి గృహిణిగా పిల్లల జీవితాలను తీర్చిదిద్దిన తీరు ఆదర్శప్రాయం అని కొనియాడారు. బాల్యం నుంచే భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం, ధార్మిక చింతన, దయాగుణం, విలువలు, ఆచార సంప్రదాయాలు వంటి అంశాలను పిల్లలకు ఉద్బోధించడం ద్వారా వారి వ్యక్తిత్వం ఎలా వికసిస్తుందో మంగతాయారు పెంపకం ద్వారా అర్థమవుతోందని పేర్కొన్నారు.

23 ఏళ్ల కుమారుడు సన్యాసం స్వీకరిస్తానని చెబితే సమాజ హితం కోసం మరోమాటకు తావులేకుండా అంగీకరించిన త్యాగధనురాలు మంగతాయారు అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన సందేశంలో కీర్తించారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తునానని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *