నాకు ఎవరి నుంచి ప్రాణ హాని ఉందో చెప్పాలి!

తనకు ఎవరి ద్వారా ప్రాణ హాని ఉందో పోలీసులు స్పష్టంగా తెలపాలని గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ డిమాండ్‌ చేశారు. అసలు ఎవరి ద్వారా ముప్పు పొంచి ఉందో చెప్పకుండా ఉండటం ఏంటని హోంమంత్రిని ప్రశ్నించారు. కాగా ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కొందరు ఉగ్రవాదుల నుంచి ప్రాణహాని ఉందని జాగ్రత్తగా ఉండాలని పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ కోరారు. ఈ మేరకు ఆష్టు 24న ఆయన లేఖ రాశారు. కొందరు ఉగ్రవాదుల నుంచి రాజా సింగ్‌కు ప్రాణహాని ఉందని , జాగ్రత్తగా ఉండాలని సీపీ కోరారు. గతంలో మాదిరిగా ద్విచక్ర వాహనంపై తిరగవద్దని, ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంలోనే ప్రయాణించాలని రాజాసింగ్‌కు సూచించారు. డీసీపీ స్థాయి అధికారి రాజాసింగ్‌ భద్రతను చూసుకుంటారని ఆయన తెలిపారు.

తనకు భద్రత పెంపు విషయంపై రాజాసింగ్ స్పందించారు. తనకు ఎవరి వల్ల ముప్పు పొంచి ఉందో, ఆ విషయాన్ని పోలీసులు తక్షణం బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు రాష్ట్ర హోంమంత్రికి లేఖ రాశారు. తన ‌నియోజకవర్గం ఎక్కువ స్లమ్‌లోనే ఉంది కాబట్టి బండి పైనే ఎక్కువగా తిరుగుతానని రాజాసింగ్‌ పేర్కొన్నారు. స్థానికంగా ముప్పు ఉందా లేక ఇతర ప్రాంతం నుంచి ఉందా అనే విషయం చెప్పాలని కోరారు.ఈ విషయంలో హోంమంత్రి సానుకూలంగా స్పందించారని అన్నారు.

అయితే తన గన్‌ లైసెన్స్‌ ఫైల్‌ రెండు సంవత్సరాల నుంచి కమిషనర్‌ కార్యాలయంలో పెండింగ్‌లో ఉందని, దీనిని తర్వలోనే అప్‌డేట్‌ చేయాలని రాజాసింగ్‌ కోరారు. ఇదిలా ఉండగా మొహర్రం సందర్భంగా హైదరాబాద్‌లో భారీ ర్యాలీకి ఎలా అనుమతి ఇచ్చారో పోలీసులు, ప్రభుత్వం సమాదానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. గణేష్ ఉత్సవాలను నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం.. బీబీ కా ఆలం ఊరేగింపునకు ఎలా అంగీకరించిందని ప్రశ్నించారు. ఈ మేరకు ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *