08/05/2021

ఐదు నెలల నుంచి ప్రజా రవాణా బంద్‌

డిపోల నుంచి బయటకు రాని సిటీ బస్సులు

పట్టాలపై పరుగు పెట్టని మెట్రో, ఎంఎంటీఎస్‌ రైళ్లు

సొంత వాహనాల్లోనే ప్రజల ప్రయాణం

మహానగరం అంటే నిత్యం ఉరుకులు పరుగులు. కోటీ పదిలక్షలకు పైగా జనాభా.. 55 లక్షలకు పైగా వాహనాలు. అర్ధరాత్రి వరకూ రోడ్లపై వాహనాల రాకపోకలు. ఐటీ కారిడార్‌లో అయితే నిరంతర  సేవల్లో ఉద్యోగులు. నగరం నలుమూలలా పరిశ్రమలు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే ప్రజా రవాణా వ్యవస్థను ఆశ్రయించాల్సిందే. కరోనాతో ఐదు నులల నుంచి సిటీ బస్సులు రోడ్డెక్కలేదు.

మెట్రో, ఎంఎంటీఎస్‌ రైళ్లు పట్టాలపై పరుగు పెట్టలేదు. బస్సుల గురించి స్టాపుల్లో వేచి చూసే వారే లేరు. లాక్‌డౌన్‌తో మార్చి 22న మూసివేసిన మెట్రోస్టేషన్ల గేట్లు ఇంకా తెరుచుకోనే లేదు. నగర వాసులు కష్టమైనా తమ దినచర్యను కొనసాగిస్తూనే ఉన్నారు. కరోనా వల్ల భౌతిక దూరం ప్రజా రవాణా వ్యవస్థను ప్రజలకు దూరం చేసింది. భారమైనా సొంత వాహనాల్లోనే రాకపోకలు సాగిస్తూ జీవనోపాధి పొందుతున్నారు.

రోజూ 38.50 లక్షల మంది ప్రయాణం 

ఆర్టీసీ సిటీ బస్సుల్లో రోజూ ప్రయాణించే వారి సంఖ్య సుమారు 33 లక్షలు. మెట్రో రైళ్లో 4 లక్షలు..ఎంఎంటీఎ్‌సలో 1.50 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. ఉదయం 4 గంటలకు ప్రారంభమైతే అర్ధరాత్రి వరకు ప్రజా రవాణా వ్యవస్థలో ఇవి కీలకంగా ఉంటాయి. ఆటోలు, క్యాబ్‌లకు అనుమతిచ్చినా కరోనా భయం ఉండడంతో వాటిలో ప్రయాణించాలంటే భయపడుతున్నారు. అత్యవసరమైతేనే తప్ప ఆటోలు, క్యాబ్‌ల్లో ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపడడం లేదు. ఆరోగ్యమే ప్రధానంగా భావించిన వారంతా సొంత వాహనాలను సమకూర్చుకున్నారు. దీంతో నగరంలో సెకండ్‌ హ్యాండ్‌ వాహనాల అమ్మకాలు కొంతమేర పెరిగాయి. అదే సమయంలో ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోం అవకాశం కలగడంతో చాలామంది రోజూ ప్రయాణం చేయాల్సిన అవసరం లేకుండాపోయింది.

ఐదు నెలలు అవుతున్నా కరోనా ప్రభావం గ్రేటర్‌ హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలో తగ్గలేదు. దీని తీవ్రత మరో రెండు నెలలు ఉండే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అప్పటి వరకు సిటీ బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్‌ రైళ్లు నడిచే అవకాశమే లేదంటున్నారు. కరోనా తీవ్రత కారణంగా విద్యా సంస్థలు ఇప్పటికీ తెరుచుకోలేదు. ప్రైవేటు విద్యా సంస్థలు కొన్ని ఆన్‌లైన్‌లోనే పాఠాలు చెబుతున్నాయి. కరోనా నేపథ్యంలో ఆటోలు, క్యాబ్‌లలో కంటే సొంత వాహనాలను వాడడమే మంచిదనే అభిప్రాయంతో చాలామంది ఉన్నారు.

కరోనా తీవ్రత తగ్గితేనే.. 

రాష్ట్రంలో కరోనా తీవ్రత ఎక్కువగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే ఉంది. సామాజిక దూరం, మాస్కులు ధరించడం, శానిటైజేషన్‌ చేయడం వంటివి కచ్చితంగా అమలుచేసే పరిస్థితి లేకపోవడంతో సిటీ బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్‌ రైళ్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని అధికారులు చెబుతున్నారు. కరోనా తీవ్రత తగ్గి, సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను పునరుద్ధ రించే అవకాశం లేదంటున్నారు రవాణా నిపుణులు కేంద్రప్రభుత్వం అన్‌లాక్‌ 4 మార్గదర్శకాలను విడుదల చేసింది. మెట్రో రైళ్లను నడిపేందుకు అనుమతిచ్చింది. మెట్రోతోపాటు సిటీ బస్సులు, ఎంఎంటీఎస్‌ రైళ్లు నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తుందా అన్నదానిపై స్పష్టత లేదు.

 

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: