అయోధ్య భూమిపూజ.. తొలి ఆహ్వానపత్రిక ముస్లింకు అందజేత!

అయోధ్య రామ మందిరం భూమిపూజ కార్యక్రమానికి ఆహ్వాన పత్రిక అందజేత కార్యక్రమం ప్రారంభమైంది. తొలి ఆహ్వానపత్రిక ఒక ముస్లింకు ఇచ్చారు. భూమిపూజకు తప్పకుండా హాజరుకావాలని ఇక్బాల్ అన్సారీకి ఇన్విటేషన్ అందించారు. రామజన్మభూమి వివాదంపై ముస్లింల తరపున బలమైన వాదన వినిపించిన వారిలో అన్సారీ ఒకరు.

మరోవైపు ఇన్విటేషన్ అందుకోవడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తనకు తొలి ఆహ్వానం అందాలన్నది శ్రీరాముడి ఆకాంక్షగా తాను భావిస్తున్నానని చెప్పారు. ఆహ్వానపత్రాన్ని మనస్పూర్తిగా స్వీకరిస్తున్నానని తెలిపారు. అయోధ్యలో హిందువులు, ముస్లింలు శాంతిసామరస్యంతో కలిసిమెలిసి జీవిస్తున్నారని చెప్పారు.

రామ మందిర నిర్మాణంతో అయోధ్య పూర్తిగా మారిపోతుందని అన్సారీ అన్నారు. అయోధ్య మరింత అందంగా మారుతుందని చెప్పారు. రాముడి దర్శనం కోసం ప్రపంచ నలుమూలల నుంచి అయోధ్యకు భక్తులు వస్తారని… దీంతో, స్థానికంగా ఎన్నో ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. మతపరమైన ఎలాంటి కార్యక్రమానికి తనను పిలిచినా తాను వెళ్తానని గతంలోనే చెప్పానని తెలిపారు. అయోధ్యలో ప్రతి మతానికి దేవుళ్లు, దేవతలు ఉన్నారని చెప్పారు. అయోధ్య అనేది పవిత్రమైన వ్యక్తుల నేల అని… ఇక్కడ రామ మందిరాన్ని నిర్మిస్తుండటం సంతోషకరమని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *