అలాంటి నాయకత్వం అవసరం లేదు: ప్రణబ్‌

అలాంటి నాయకత్వం అవసరం లేదు: ప్రణబ్‌

ప్రజల ఆకాంక్షలను తీర్చే వ్యక్తి దేశానికి నాయకుడిగా ఉండాలని మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ వ్యాఖ్యానించారు. కాల్పనిక ధోరణిలో దేశాన్ని నడిపించే నేతలు అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. పేదరిక నిర్మూలనలో దేశం ఇంకా ఎంతో సాధించాల్సి ఉందని గుర్తుచేశారు. దిల్లీలో సోమవారం జరిగిన ఓ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘కాల్పనిక ధోరణిలో సాగే నేతృత్వం ఈ దేశాన్ని ముందుకు నడపలేదు. పెరుగుతున్న ప్రజల అవసరాలకనుగుణంగా పనిచేసే వ్యక్తి నాయకుడిగా ఉండాలి. పేదరిక నిర్మూలనలో దేశం ఇంకా ఎంతో పురోభివృద్ధి సాధించాల్సి ఉంది’’ అని ప్రణబ్‌ అన్నారు.

దేశంలోని సింహభాగం సంపద కేవలం ఒక శాతం వ్యక్తుల వద్ద ఉండడం పట్ల ప్రణబ్‌ విచారం వ్యక్తం చేశారు. పేద ప్రజల అభ్యున్నతికి కార్పొరేటు సంస్థలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధిలో అన్ని వర్గాల వారినీ కలుపుకొని పోవాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. గత దశాబ్ద కాలంలో దాదాపు 27 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చారని తెలిపారు. ఇది సంతోషించాల్సిన విషయమైనప్పటికీ ఇంకా గణనీయ సంఖ్యలో ప్రజలు దారిద్ర్య రేఖ దిగువన జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత లాభాలు చేకూర్చే విధానాల ద్వారా ప్రజల మధ్య వ్యత్యాసాలు ఇంకా పెరుగుతాయన్నారు. ఉద్యోగాల కల్పన, సామాజిక సంపద సృష్టి లాంటి లక్ష్యాలకనుగుణంగా వ్యాపారవేత్తలు, నాయకుల నిర్ణయాలు ఉండాలని ఆయన హితవు పలికారు.

వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులకు పరిష్కార మార్గాలు కనుక్కోవాల్సిన అవసరం ఉందని ప్రణబ్‌ ముఖర్జీ గుర్తుచేశారు. వైద్య రంగంలోనూ ఇంకా మౌలిక వసతులు మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా వైద్య సౌకర్యాలు చేరాలన్నారు. గణాంకాలపరంగా, పరిమాణాల దృష్ట్యా దేశం ఎంతో పురోభివృద్ధి సాధించినప్పటికీ.. నాణ్యత విషయంలో ఇంకా సాధించాల్సింది చాలా ఉందని అభిప్రాయపడ్డారు. అలాగే విద్యారంగంలోనూ అనేక మార్పులు తీసుకురావాలని సూచించారు. ఇలా పలు రంగాల్లో దేశం వృద్ధి సాధించినప్పుడే ప్రజల్లో సంక్షేమం వెల్లువిరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: