సిఫారస్‌ ఉంటేనే.. కరోనా పరీక్షలు!

కరోనా లక్షణాలు.. అనుమానం ఉన్న వారు కోవిడ్‌ పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్తే ఇక్కట్లు తప్పడంలేదు. నిన్ను ఎవరు పంపితే వచ్చావ్‌.. ఎవరైన నేతల సిఫారసు ఉందా.. నువ్వే స్వతహాగా వచ్చావా.. అంటూ వారిపై అక్కడి సిబ్బంది ప్రశ్నలు గుప్పిస్తున్నారు. సిఫారసు ఉంటే నిమిషాల్లో పని పూర్తి అవుతుంది.. లేదంటే గంటల తరబడి క్యూలైన్‌లో నిలబడి ఎదురుచూడాల్సిందే. ఇదీ మహబూబ్‌నగర్‌ జిల్లా జనరల్‌ ఆస్పత్రి వద్ద నెలకొన్న పరిస్థితి.  

 కరోనా బాధిత కుటుంబ సభ్యులు, ప్రైమరీ కాంటాక్స్‌తో పాటు జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు కన్పిస్తే చాలు జిల్లా జనరల్‌ ఆస్పత్రికి వెళ్తున్నారు. కోవిడ్‌ పరీక్ష కోసం నమూనాలు సేకరించాలని క్యూలైన్‌లో నిలబడుతున్నారు. కానీ అక్కడ పని చేసే వైద్య సిబ్బంది, అధికారులు మాత్రం పార్టీల నేతలు, ఇతర అధికారుల సిఫారసు ఉన్న వారికే ప్రాధాన్యమిస్తున్నారు. ఇక గంటల పాటు క్యూ లైన్‌లో నిలబడిన సామాన్యుడి సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఈ రోజు ఇంత మందికే చేస్తామని తిప్పి పంపిస్తున్నారు. ప్రధానంగా దూర ప్రాంతాల నుంచి పరీక్షల కోసం వచ్చేవారు గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. వంద మందికిపైగా క్యూలైన్‌లో ఉంటే మరో రోజు రావాలని తిప్పి పంపుతున్నారు. చేసేదేమీ లేక వందల కిలోమీటర్ల నుంచి వచ్చిన వారు తిరిగి వెళ్లాల్సి వస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *