కోహ్లీని తక్కువ అంచనా వేయొద్దు!

కోహ్లీని తక్కువ అంచనా వేయొద్దు!

విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఆడిన ఆరు మ్యాచుల్లో ఓటమి పాలైంది. కోహ్లీ సారథ్యంలోనే భారత జట్టు స్వదేశంలో ఆడిన టెస్టు, టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది. దీంతో కోహ్లీపై క్రికెట్‌ అభిమానులతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. భారత మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ ఒకడుగు ముందుకేసి ‘కోహ్లీ.. నువ్వు కెప్టెన్సీ నుంచి తప్పుకో.. బెంగళూరుకు ఒక్కసారి కూడా కప్పు తేలేకపోయావు. నువ్వు మంచి బ్యాట్స్‌మన్‌ కావొచ్చు.. కానీ కెప్టెన్సీలో మాత్రం ఎప్పటికీ అప్రెంటీస్‌వే’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. గంభీర్‌తో పాటు పలువురు విదేశీ మాజీ క్రికెట్లరు సైతం విరాట్‌ను విమర్శించారు. ఐపీఎల్‌ ప్రభావం ప్రపంచకప్‌పై పడకుండా ఉండాలంటే కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని సూచిస్తున్నారు.

అయితే.. కోహ్లీకి మద్దతుగా భారత జట్టు మాజీ సారథి, చీఫ్‌ సెలెక్టర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ నిలిచారు. కేవలం ఐపీఎల్‌ ప్రదర్శన ఓ ఆటగాడిని అంచనా వేసేందుకు సరిపోదన్నారు. విరాట్‌ కోహ్లీ ప్రపంచంలోనే గొప్ప బ్యాట్స్‌మెన్‌లో ఒకరన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. కోహ్లీ.. వన్డేలు, టెస్టుల్లో అద్భుతంగా రాణించాడని తెలిపారు. ఈ సారి ఇంగ్లాండ్‌లో ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో.. ఇంగ్లాండ్‌లో బ్యాటింగ్‌ చేయడం అంత సులభం కాదని తెలిపారు. అయితే ఆ పరిస్థితులకు అలవాటుపడ్డ ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియానే ఈసారి ఫేవరెట్లుగా కనిపిస్తున్నాయన్నారు. భారత్‌ ప్రపంచకప్‌లో సెమీస్‌కు వెళ్లడం సులభమేనని నమ్మకం వ్యక్తం చేశారు. మునుపెన్నడూ లేనంత నాణ్యమైన బౌలింగ్‌ ఇప్పుడు భారత జట్టు సొంతమని పేర్కొన్నారు. ఇంతకు ముందు భారత్‌ చివరి పది ఓవర్లలో విపరీతంగా పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చేదని గుర్తు చేశారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. కోహ్లీ, రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌లో రాణిస్తే.. భారత్‌ కూడా కప్పు గెలిచే అవకాశాలున్నాయన్నారు. ఇప్పటికే విరాట్‌ కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. రోహిత్‌ కూడా బ్యాట్‌ ఝులిపిస్తే టీమిండియాకు తిరుగుండదని తెలిపారు. కానీ ఆ ఇద్దరి మీదే బ్యాటింగ్‌ మొత్తం ఆధారపడటం మంచిదికాదన్నారు. మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ కూడా పరుగులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే టాప్‌ ఆర్డర్‌ మీద ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇక జట్టులో నాలుగో స్థానం కోసం చాలా మంది నాణ్యమైన ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారన్నారని తెలిపారు. కేఎల్‌ రాహుల్, అజింక్యా రహానె మంచి ఫామ్‌లో ఉన్నారు. వీళ్లతో పాటు మయాంక్‌ అగర్వాల్‌కు ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం ఉంది. కానీ ఏ ఆటాడినైనా ఐపీఎల్‌ ఆధారంగా అంచనా వేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: