
- ఇటీవల పంజాబీ సింగర్ మూసేవాలా హత్య
- తెరపైకి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్
- సల్మాన్, అక్షయ్ లకు బెదిరింపులు
- అప్రమత్తమైన మహారాష్ట్ర ప్రభుత్వం

బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ లకు మహారాష్ట్ర ప్రభుత్వం భద్రత పెంచింది. సల్మాన్ ఖాన్ కు వై ప్లస్, అక్షయ్ కుమార్ కు ఎక్స్ కేటగిరీ భద్రత కల్పించనుంది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపుల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇటీవల పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యతో బిష్ణోయ్ గ్యాంగ్ మరోసారి తెరపైకి వచ్చింది. మూసేవాలా హత్య బిష్ణోయ్ గ్యాంగ్ పనే అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. ఈ నేపథ్యంలో, బిష్ణోయ్ ముఠా నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్న బాలీవుడ్ అగ్రతారలకు భద్రత పెంపుపై మహారాష్ట్ర సర్కారు దృష్టి సారించింది.
వై ప్లస్ కేటగిరీ కింద సల్మాన్ ఖాన్ కు నలుగురు సాయుధ గార్డులు షిఫ్టుల వారీగా భద్రత కల్పిస్తారు. అక్షయ్ కుమార్ కు ఎక్స్ కేటగిరీ కింద మూడు షిఫ్టుల్లో ముగ్గురు సాయుధ గార్డులు భద్రత కల్పిస్తారు. కాగా, సల్మాన్ ఖాన్ కు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తుపాకీ లైసెన్స్ మంజూరు చేయడం తెలిసిందే.