కరోనా అత్యధికంగా ఉన్న దేశాల్లో మూడో స్థానంలో ఉన్నాం.. మరి ఇది మోదీ వైఫల్యమా?: కేటీఆర్

మహబూబ్‌ నగర్‌లో ఈ రోజు తెలంగాణ మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్‌, శ్రీనివాస్ గౌడ్‌ చేతుల మీదుగా ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభోత్సవం జరిగింది. 50 ఎకరాల విస్తీర్ణంలో రూ.450 కోట్లతో ఈ కళాశాలను నిర్మించారు.  ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ కరోనాపై ప్రతిపక్ష పార్టీ నేతల తీరును విమర్శించారు.

కరోనాకు పేద, ధనిక అన్న తేడాలు ఉండవని ఎవరికైనా రావచ్చని కేటీఆర్‌ అన్నారు. తెలంగాణలో కరోనా విషయంలోనూ విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని, విపక్షాలు నిర్మాణాత్మక సూచనలు చేస్తే స్వీకరిస్తామని చెప్పారు. అనవసర విమర్శలు చేసి వైద్య సిబ్బందిలో ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీయొద్దని ఆయన సూచించారు.

కరోనా కేసుల్లో దేశం మూడో స్థానంలో ఉందని, మరి ఇది ప్రధాని మోదీ వైఫల్యంగా భావించాలా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే అన్ని పనులు చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు.

భారత్‌లో తయారైన మందులు ప్రపంచానికి ఉపయోగపడుతున్నాయని కేటీఆర్ తెలిపారు. ఫార్మా పరిశ్రమ పట్ల ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టించొద్దని ఆయన చెప్పారు. అలాగే, సమాజంలో కరోనా బాధితులను వెలివేసినట్లు చూడడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.

తాము ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నామని కేటీఆర్ అన్నారు. ప్రైవేటు ఆసుపత్రులు పడకలు లేవని తిప్పి పంపుతున్నాయని, కానీ, ప్రభుత్వ ఆసుపత్రులు మాత్రం రోగి ఏ స్థితిలో ఉన్నప్పటికీ వారిని చేర్చుకుని వైద్యం అందిస్తున్నాయని కొనియాడారు. కరోనా అనేది మానవాళి మొత్తం ఎదుర్కొంటున్న విపత్తని, అందరం శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *