ప్రభుత్వ నిబంధనలతో అమ్మవారికి బోనాల సమర్పణ- తలసాని

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ఈనెల 12వ తేదీన సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరను సాంప్రదాయబద్దంగా నిర్వహిస్తామని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ వెల్లడించారు. శుక్రవారం మహంకాళి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దేవాదాయశాఖ, పోలీసుశాఖతో పాటు ఆలయ ట్రస్టీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి ఏటా ఎంతో ఘనంగా లక్షలాది మంది భక్తుల సమక్షంలో నిర్వహించే బోనాల జాతరను కరోనా మహమ్మారి కారణంగా ఈనెల 12వ తేదీన జరిగే జరిగే జాతర, పూజలు, బోనాల సమర్పణ ఆలయం లోపల నిర్వహిస్తామన్నారు. ఆలయ అధికారులు, పండితులు,ట్రస్టీ సభ్యులు మాత్రమే ఇందులో పాల్గొంటారని తెలిపారు. ఇతరులు ఎవరినీ అనుమతించబోమని అన్నారు.

పరిస్థితులను అర్ధం చేసుకుని భక్తులు సహకరించాలని కోరారు. అదే విధంగా 13వతేదీన రంగం కూడా కరోనా నిబంధనలకనుగుణంగానే నిర్వహించబడుతుందన్నారు. దీనిని ప్రజలంతా వీక్షించేలా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందన్నారు. జాతర వద్ద పటిష్టమైన భద్రత కల్పించాలని పోలీసు అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, ఆర్‌జేసి రామకృష్ట, అసిస్టెంట్‌కమిషనర్‌ బాలాజీ, ఈవోలు మనోహర్‌, అన్నపూర్ణ, ఆలయ ట్రస్టీ కామేశ్‌, మహంకాళి ఏసీపీ వినోద్‌, సీఐ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *