22/04/2021

నెలకు రూ.500 కడితే ఆకర్షణీయమైన బహుతులు.. స్కీమ్ పేరుతో స్కామ్..

ఓ వ్యక్తి నెలకు రూ.500 కడితే ఆకర్షణీయమైన బహుమతులు ఇస్తానన్నాడు. అలా 20 నెలల పాటు రూ.500 చొప్పున రూ.10వేలు చీటి కట్టాలి. ప్రతినెలా ఆరుగురికి బైకులు, వాషింగ్ మెషీన్లు, బంగారు నక్లెస్ వంటి వస్తువులు సొంతం చేసుకోవొచ్చంటూ చెప్పాడు. దీంతో ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 1500 మంది తన స్కీమ్‌లో చేర్పించాడు. ఆ స్కీమ్‌ను కాస్త తనకు అనుకూలంగా మలుచుకుని స్కామ్ చేశాడు. తీరా విషయం తెలుసుకుని బాధితులు లబోదిబోమంటూ నెత్తినోరు కొట్టుకుంటూ పోలీసు స్టేషన్‌కు పరుగులు తీశారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన ఓ సంస్థ పేరుతో రాహుల్ అనే వ్యక్తితో పాటు మరికొంత మంది పిఠాపురంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన 1500 మంది కొత్త స్కీమ్ పేరుతో చేర్చారు.

అందులో భాగంగా నెలకు రూ.500 చొప్పున 20 నెలలకు రూ. రూ.10 వేలు కట్టాలి. అయితే ప్రతినెలా ఆరుగురికి ద్విచక్ర వాహనాలు, వాషింగ్ మెషిన్లు, బంగారు నక్లెస్ వంటి వస్తువులను ఇస్తామని నమ్మబలికారు. ఆ సంస్థ పేరుతో రసీదులు ముద్రించి డబ్బు చెల్లించిన వారికి ఇచ్చారు. అయితే నెలనెలా డబ్బులు కట్టినా వస్తువులు ఇవ్వలేదు. దీనికితోడు రాహుల్ కొంతకాలంగా కన్పించకుండా పోయాడు. కరోనా వైరస్ కారణంగా రాలేదని అందరూ భావించారు.

ఈ క్రమంలో నిందితుడు పిఠాపురం రావడంతో చీటి కట్టిన వారు కొంతమంది అతడిని పట్టుకుని పిఠాపురం పట్టణ పోలీసులకు అప్పగించారు. విషయం తెలుసుకుని తమకు న్యాయం చేయాలంటూ దాదాపు 200 మంది పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ మేరకు పోలీసులు బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించి విచారణ నిమిత్తం రాహుల్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: