
- యూపీలో ముజఫర్‌నగర్‌లో ఘటన
- ఓ యువకుడిని కిడ్నాప్ చేశారన్న ఫిర్యాదుతో పోలీసుల గాలింపు చర్యలు
- మార్చరీలోని శవం అతడిదేమోనని అనుమానం
- శవంపై టాటూ ఆధారంగా ఆ మృతదేహం తమ కుమారుడిడేదనని పొరపాటు పడ్డ తల్లిదండ్రులు
- అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా యువకుడు మరో చోట జీవించే ఉన్నాడని పోలీసుల తీపి కబురు

మార్చరీలో ఓ శవాన్ని తమ కుమారుడిగా పొరపాటున గుర్తించిన తల్లిదండ్రులు అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. కానీ అతడు మరో చోట బతికే ఉన్నాడని పోలీసులు చివరి నిమిషంలో కబురంపడంతో వారి ఆనందానికి అంతేలేకుండా పోయింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో వెలుగు చూసిందీ ఘటన. ముజఫర్‌నగర్‌కు చెందిన ఓ కుటుంబం మోంటూ(18) అనే కుర్రాడు తమ కూతురిని(18) కిడ్నాప్ చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, పోలీసులు యువతీయువకులను వెతికేందుకు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో మార్చరీలో ఉన్న ఓ శవం మోంటూది అయి ఉండొచ్చని పోలీసులకు అనుమానం వచ్చింది.
దీంతో, మోంటూ కుటుంబాన్ని మార్చరీ వద్దకు పిలిపించారు. తల భాగం లేకపోవడంతో శవంపై టాటూ ఆధారంగా అది తమ కుమారుడేనని గుర్తించిన అతడి తల్లిదండ్రులు బోరుమన్నారు. యువతి కుటుంబమే తమ కుమారుడిని అంతం చేసిందని ఆరోపించారు. బుధవారం రాత్రి వారు స్థానిక పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. చివరకు అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మోంటూ ఆ యువతితో కలిసి చండీఘడ్‌లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. విషయం మోంటూ కుటుంబానికి చెప్పడంతో వారి అంతేలేకుండా పోయింది.