9 మంది జనసేన నేతలకు బెయిల్… హైకోర్టు తీర్పుపై పవన్ కల్యాణ్ హర్షం

Spread the love
  • విశాఖ ఎయిర్ పోర్టు వద్ద మంత్రులు, వైసీపీ నేతపై దాడి
  • ఈ కేసులో అరెస్టై జైల్లో ఉన్న 9 మందికి బెయిల్ ఇచ్చిన హైకోర్టు
  • ప్రభుత్వం తమ పార్టీ నేతలపై అక్రమంగా కేసులు పెట్టిందన్న పవన్
  • న్యాయ వ్యవస్థపై తనకు విశ్వాసం ఉందని వెల్లడి
విశాఖ విమానాశ్రయంలో ఏపీ మంత్రులు, వైసీపీ నేతపై జరిగిన దాడి ఘటనలో అరెస్టైన జనసేనకు చెందిన 9 మంది నేతలకు బెయిల్ లభించింది. జనసేన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరిపిన ఏపీ హైకోర్టు… 9 మంది నేతలకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో పోలీసులు మొత్తంగా 70 మందిని అరెస్ట్ చేయగా… వారిలో 61 మందికి స్థానిక కోర్టే బెయిల్ మంజూరు చేసింది. మిగిలిన 9 మందిపై మోపిన అభియోగాలు తీవ్రమైనవి కావడంతో వారికి బెయిల్ లభించలేదు.

తాజాగా 9 మంది జనసేన నేతలు హైకోర్టును ఆశ్రయించగా… వారికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం విశాఖ జైల్లో ఉన్న జనసేన నేతలు కోర్టు ఆదేశాలు అందగానే విడుదల కానున్నారు. ఇదిలా ఉంటే… జనసేన నేతలకు బెయిల్ లభించడంపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. జనసేన నేతలపై ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయించిందని ఆయన ఆరోపించారు. నేతలకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం సంతోషకరం అని ఆయన వ్యాఖ్యానించారు. న్యాయ వ్యవస్థను తానెప్పుడూ సంపూర్ణంగా విశ్వసిస్తానన్నారు.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com