14/05/2021

వారికి కేసీఆర్ వార్నింగ్… అరెస్ట్ చేయాలని డీజీపీకి ఆదేశం

జనతా కర్ఫ్యూ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ చేసిన పలు సూచనలను సోషల్ మీడియాలో కొందరు అవహేళన చేయడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. ఆదివారం రోజు సాయంత్రం ఐదు గంటల తరువాత ప్రజలందరూ తాము ఉన్న చోట చప్పట్లు కొడుతూ మన కోసం పని చేస్తున్న వారికి సంఘీభావం తెలపాలని ప్రధాని మోదీ కోరారు. అయితే దీన్ని సోషల్ మీడియాలో కొందరు అపహాస్యం చేయడాన్ని సీఎం కేసీఆర్ తప్పుబట్టారు. ప్రధాని స్థాయి వ్యక్తి ఓ సమస్యపై పోరాటం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను చేపడితే… కొందరు ఇలాంటి చర్యలకు దిగడం మంచిదికాదని కేసీఆర్ అన్నారు.  దేనికైనా ఓ హద్దు ఉంటుందని… ప్రధాని స్థాయి వ్యక్తిని ఈరకంగా కించపరచడం ఏంటని ఆయన మండిపడ్డారు. ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని… వారిని గుర్తించి అరెస్ట్ చేయాలని అక్కడే ఉన్న డీజీపీ మహేందర్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రధాని చేసిన సూచనను పాటించడం వల్ల మనమంతా ఈ అంశంలో ఎంతో ఐక్యంగా ఉన్నామని చెప్పినట్టు అవుతుందని… దానికి పెద్దగా శ్రమించే అవసరం కూడా ఉండదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. దయచేసి ఎవరూ సోషల్ మీడియాలో ఈ రకంగా వ్యవహరించవద్దని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: