17/04/2021

Janata Curfew | కేసీఆర్ సంచలన నిర్ణయం… జనతా కర్ఫ్యూ సమయం పెంపు…

తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 22వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 14 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిస్తే… సీఎం కేసీఆర్ మరో అడుగు ముందుకేసి 24 గంటల పాటు (22వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 23వ తేదీ ఉదయం 6 గంటల వరకు) జనతా కర్ఫ్యూ పాటించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ‘ప్రధాని మోదీ పిలుపునిచ్చినట్టు జనతా కర్ఫ్యూ పాటించాలి. తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలవాలి. ప్రధాని మోదీ చెప్పినట్టు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే కాకుండా ఉదయం 6 గంటల నుంచి 23వ తేదీ 6వ తేదీ వరకు కూడా జనతా కర్ఫ్యూ పాటించాలి. ఆర్టీసీ బస్సులు కూడా తిరగవు. కేవలం డిపోకి 5 బస్సులు మాత్రం సిబ్బందితో సహా రెడీగా ఉంటాయి. అత్యవసరం కోసం మాత్రమే అవి సిద్ధంగా ఉంచుతున్నా. రేపు (మార్చి 22న) ఇతర రాష్ట్రాల నుంచి బస్సులు కూడా రావొద్దు. ఒక వేళ వచ్చినా సరిహద్దుల్లోనే మూసేస్తాం. హైదరాబాద్‌లో మెట్రో రైళ్లు కూడా రద్దు చేస్తున్నాం. అయితే, 5 రైళ్లు మాత్రం రెడీగా ఉంచుతున్నాం. కేవలం అత్యవసర సేవలు మాత్రమే పనిచేస్తాయి.’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారి వల్లే కరోనా వైరస్ వ్యాపిస్తోందన్న సీఎం కేసీఆర్.. తెలంగాణలో ఈ మధ్య కాలంలో విదేశాల నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వైద్యులను కలవాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా రావడానికి నిరాకరిస్తే ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని పిలుపునిచ్చారు. 65 సంవత్సరాలు పైబడిన వారు, పది సంవత్సరాల వయసు లోపు ఉన్నవారు రెండు వారాల పాటు బయటకు రావొద్దని కేసీఆర్ సూచించారు. రాష్ట్రంలో అవసరమైతే టోటల్ షట్ డౌన్ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. బోర్డర్లు కూడా మూసేస్తామన్నారు. పరిస్థితిని బట్టి నిత్యావసర సరుకులు కూడా ఇంటికి పంపిణీ చేస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చినట్టు 22వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఇంటి బయట నిలబడి చప్పట్లు కొట్టాలని కేసీఆర్ సూచించారు. ఆ రకంగా కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో పోరాడుతున్న వైద్యులకు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. అయితే, ఈ చప్పట్లు కొట్టాలన్న మోదీ పిలుపు మీద కూడా కొందరు హేళన చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. తెలంగాణలో కరోనాని నివారించడానికి రూ.5వేల కోట్లే కాదు, అవసరమైతే రూ.10వేల కోట్లు కూడా కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ స్పష్టం చేశారు.
Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: