17/04/2021

చిరంజీవితో నటించడానికి రెండు కోట్లు కావాలంటోన్న కాజల్..

మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆచార్యగా పిలుస్తోన్న ఈ సినిమాలో చిరంజీవి దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఆచార్యను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. సామాజిక కోణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరు లుక్ కూడా ఆసక్తిగొలిపేలా ఉంది. మొన్నటి వరకు ఈ సినిమాలో మహేష్ బాబు ఓ పాత్రలో నటించనున్నాడు అని ఓ ప్రచారం జరిగింది. కానీ ఏవో కారణాల వల్ల ఆయన ఆ సినిమా నుండి తప్పుకున్నాడట. దీంతో రామ్ చరణ్ ఆ పాత్రలో మెరవనున్నాడని సమాచారం. అది అలా ఉంటే ఈ చిత్రంలో చిరు సరసన హీరోయిన్ గా త్రిష నటించాల్సివుండగా క్రియేటివ్ డిఫరెన్స్‌సెస్ వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. త్రిష ఆచార్య సినిమా నుండి తప్పుకోవడంతో ఆమె స్థానంలో హీరోయిన్‌గా అందాల చందమామ కాజల్‌ని ఎంపిక చేసిందట చిత్రబృందం. కాజల్ కూడా గతంలో చిరంజీవి 150వ మూవీ ‘ఖైదీ 150’లో నటించి ఆయనతో రొమాన్స్ చేసిన సంగతి తెలిసిందే.

కాగా ఈ చిత్రం కోసం కాజల్ గట్టిగానే డిమాండ్ చేస్తుందట. నిజానికి ప్రస్తుతం కాజల్ కి తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు. అయినప్పటికీ పాత్ర రీత్యా నిడివి, ప్రాధాన్యత దృష్ట్యా ఆమె బాగానే అడుగుతున్నదట. ఈ సినిమాలో ఆమె నటించడానికి పారితోషికంగా రెండున్నర కోట్లు అడిగిందట. అయితే చివరికి ఒకటిన్నర కోటికి చేయడానికి ఆమె అంగీకరించినట్టు సమాచారం. త్వరలోనే ఆమె షూటింగ్‌లో పాల్గొననున్నట్టు చెబుతున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: