
Krishna Water : తెలుగు రాష్ట్రాల మధ్య పొలిటికల్ హీట్‌ను పెంచే కృష్ణా నది మిగుల జలాల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కృష్ణా మిగులు జలాల్లో ఏపీ, తెలంగాణ వాటాలు తేలుస్తామని కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య వాటాలను నిర్ధారించే అంశం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిశీలనలో ఉందని వెల్లడించింది. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తిశాఖ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది.
కృష్ణా బేసిన్లో మిగులు జలాలను రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసేందుకు నిర్ధిష్టమైన విధానం రూపకల్పన చేసే బాధ్యతను ఆర్‌ఎంసీకి అప్పగించామని వివరించింది కేంద్రం. వర్షాకాలంలో కృష్ణా నదిపై ఉన్న ప్రధాన ప్రాజెక్టుల నుంచి విడుదలయ్యే మిగులు జలాలను రెండు రాష్ట్రాలకు నియంత్రిత పద్ధతిలో పంపిణీ చేసేందుకు CWCకి చెందిన సాంకేతిక సంఘాన్ని ఏర్పాటు చేశామని తెలిపింది.
ఉభయ తెలుగు రాష్ట్రాలు దీనికి సంబంధించిన అవసరమైన సమాచారం సమర్పించకపోవడంతో.. సాంకేతిక సంఘం తన బాధ్యతను పూర్తి చేయలేకపోయిందని వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. కృష్ణా నదిలో లభించే మిగులు జలాలను వినియోగించుకునే స్వేచ్ఛను బచావత్ ట్రైబ్యునల్ ఏపీకి కల్పించిందని గుర్తు చేసింది. మిగులు జలాల వినియోగం తప్ప నికర జలాలపై ఏపీకి హక్కు ఉండబోదని ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. రెండు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేసేందుకు ట్రైబ్యునల్ కాలపరిమితిని పొడిగించామని చెప్పింది.
Follow us on Social Media