తిరుమలలో అఖండ హరినామ సంకీర్తన పునఃప్రారంభం…

Spread the love

తిరుమల : అఖండ హరినామ సంకీర్తన తిరుమలలో పునఃప్రారంభమైంది. ఇవాల్టి నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన జానపద కళాకారులు పాల్గొని హరినామ సంకీర్తనం చేశారు. రెండేండ్ల తర్వాత హరినామ సంకీర్తన కార్యక్రమం ప్రారంభించడంతో తిరుమల గిరులు హరినామంతో మార్మోగాయి. వీనుల విందుగా సాగిన ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు, తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. తొలిసారి 2007లో అఖండ హరినామ సంకీర్తన నిర్వహించారు.

తిరుమల కొండపై అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన, పూజలు చేసిన అనంతరం టీటీడీ ఎగ్జిక్యూటీవ్‌ అధికారి ఏవీ ధర్మారెడ్డి ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి విజయసారధి, ఎస్వీబీసీ సీఈవో షణ్ముఖ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన జానపద కళాకారులు పాల్గొని జానపద శైలిలో భజనలు చేశారు. 2007 లో ప్రారంభించిన ఈ కార్యక్రమం కరోనా కారణంగా నిలిచిపోయింది. కాగా, రెండేళ్ల విరామం తర్వాత తిరిగి ప్రారంభమవడం పట్ల టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి సంతోషం వెలిబుచ్చారు.

ప్రతిరోజూ ఒక్కో జట్టులో 15 మంది చొప్పున 12 బృందాల్లో కళాకారులు పాల్గొంటారు. ఏడాది పొడవునా ఈ కార్యక్రమం కొనసాగనున్నది. 7,500కు పైగా బృందాల్లో దాదాపు 1.30 లక్షల మంది కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. కంప్యూటరైజ్డ్ విధానం ద్వారా వీరి ప్రదర్శనకు అవకాశం కల్పిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఒక్కో బృందం రోజుకు 2 గంటలపాటు వివిధ షిఫ్టుల్లో ప్రదర్శన ఇస్తుందని వారు పేర్కొన్నారు. కళాకారులకు వసతి, రవాణ ఛార్జీలు ఇతర సౌకర్యాలు అధికారులు కల్పిస్తున్నారు.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com