
పరువు కోసం పెద్దలు ప్రాణాలు తీస్తున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. పిల్లల కంటే పరువుకే పెద్దలు ప్రాధాన్యత ఇస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలను సైతం హతమారుస్తున్నారు. అలాంటి ఘటనే పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈదారుణం జిల్లావ్యాప్తంగా కలకలం రేపుతోంది.
పల్నాడు జిల్లా మాచర్ల మండలం కొత్తపల్లికి చెందిన 20 ఏళ్ల వెండి గోపి దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామ శివారులోని పొలంలో శవం కనిపించడం కలకలం రేపింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ..సంచిలో మూటగట్టిన శవాన్ని బయటకు తీశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా విచారణ జరిపారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి.
గోపి అనే యువకుడిని తల్లిదండ్రులే చంపినట్లు గుర్తించారు. జూలాయిగా తిరుగుతూ, అప్పులు చేస్తున్నాడని నిత్యం ఇంట్లో గొడవలు జరిగేవి. ఈక్రమంలో కుటుంబ పరువు తీస్తున్నాడనే కోపంతో మూడురోజుల క్రితం రాడ్‌తో కొడుకుపై దాడి చేశారు. ఈ ఘటనలో గోపి అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కొడుకు శవాన్ని మూటగట్టి ఆటో డ్రైవర్ సహాయంతో శవాన్ని గ్రామ శివారులోకి తీసుకెళ్లారు. అక్కడే పొలంలో పాతిపెట్టారు. మూడురోజుల తర్వాత దీనిపై గ్రామంలో విస్తృత ప్రచారం జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసును చేధించారు.
Follow us on Social Media