
కోల్కతా: తన స్నేహితురాలు అర్పితా ముఖర్జీ ఇళ్లల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు స్వాధీనం చేసుకున్న రూ. 50 కోట్ల నగదు, కేజీల కొద్దీ బంగారం తనవి కావని పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ తెలిపారు. టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్లో కోట్లాది డబ్బులు ముట్టినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో పార్థా ఛటర్జీతోపాటు స్నేహితురాలు అర్పితా ముఖర్జీని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే పార్థా ఛటర్జీని హెల్త్ చెకప్ కోసం కోల్కతాలోని కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి ఆదివారం తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మీడియా సిబ్బంది ఆయనను చుట్టుముట్టి పలు ప్రశ్నలు సంధించారు. దీంతో ‘ఆ డబ్బు నాది కాదు’ అని పార్థా ఛటర్జీ బదులిచ్చారు. ఎవరైనా కుట్ర పన్నుతున్నారా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘సమయం వచ్చినప్పుడు అంతా తెలుస్తుంది’ అని అన్నారు.
కాగా, తన ఇళ్ల నుంచి ఈడీ స్వాధీనం చేసుకున్న రూ.50 కోట్లకుపైగా డబ్బు విద్యా శాఖ మాజీ మంత్రి పార్థా ఛటర్జీవేనని ఆయన స్నేహితురాలు అర్పితా ముఖర్జీ తెలిపింది. టీచర్ల రిక్రూట్మెంట్, బదిలీలు, కాలేజీల గుర్తింపు అనుమతికి సంబంధించి ఆయన అందుకున్న లంచాలని ఈడీ దర్యాప్తులో వెల్లడించింది.
మరోవైపు కోట్లలో నగదు, కేజీల్లో బంగారంతోపాటు భారీగా విదేశీ ఎక్సైంజ్, ఇరువురి పేరు మీద పలు ఆస్తులు, ఖరీదైన కార్లను కూడా ఈడీ గుర్తించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో పార్థా ఛటర్జీని మంత్రి పదవి నుంచి తొలగించడంతోపాటు పార్టీ నుంచి కూడా టీఎంసీ సస్పెండ్ చేసింది.