
అమరావతి : ఏపీలోని పోలవరం ప్రాజెక్టును కేంద్ర జల సంఘం సభ్యులు ఇవాళ సందర్శించారు. సీడబ్ల్యూసీ డైరెక్టర్ ఖయ్యం మహమ్మద్ నేతృత్వంలోని సభ్యులు ప్రాజెక్టును సందర్శించి ఎగువ కాఫర్ డ్యామ్ ను పరిశీలించారు. ప్రాజెక్టు పరిస్థితి, జరుగుతున్న పనులను వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన కేంద్రం అప్పటి నుంచి ఆంధ్రప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రాజెక్టులో నిర్మాణాల ను చేపడుతుంది. ప్రాజెక్టు నిర్మాణం వల్ల భూముల కోల్పోయే వారికి పరిహారాన్ని అందజేస్తు మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది, ఇటీవల ప్రాజెక్టుకు వచ్చిన వరద వల్ల ముంపు గ్రామాల్లోకి వచ్చి పంట పొలాలు, ఆస్తి నష్టం సంబవించింది.
తెలంగాణ ఈఎన్సీ లేఖ
మరోవైపు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి నిన్న తెలంగాణ ఈఎన్సీ లేఖ రాసింది. పోలవరం బ్యాక్ వాటర్‌పై అధ్యయనం చేయాలని కోరింది. బ్యాక్ వాటర్ ప్రభావంపై స్వతంత్ర సంస్థతో అధ్యయనం చేయించాలని సూచించింది. ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలానికి బ్యాక్ వాటర్ ముప్పు ఉంటుందని స్పష్టం చేసింది. ఎఫ్ఆర్ఎల్ వద్ద నీటినిల్వ ఉంటే ముంపు ఎక్కువ ఉంటుందని తెలిపింది.
ముర్రేడువాగు, కిన్నెరసాని నదుల పరిసరాలు మునుగుతాయని పేర్కొంది. రక్షణ కట్టడాలు నిర్మించి, నివారణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. బ్యాక్ వాటర్‌తో ఏర్పడే ముంపును నివారించాలని, నష్ట నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఈఎన్సీ పోలవరం ప్రాజెక్టు అథారిటీని కోరింది.