
ఆంధ్రప్రదేశ్‌లో మంకీపాక్స్ కేసు కలకలం రేపుతోంది. గుంటూరుకు చెందిన ఎనిమిదేళ్ల బాలుడికి మంకీపాక్స్ లక్షణాలు బయటపడటం స్థానికంగా సంచలనంగా మారింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా నుంచి పదిహేను రోజుల క్రితం ఒక బాలుడు ఏపీలోని గుంటూరుకు వచ్చాడు. వారం తర్వాత నుంచి అతడిలో మంకీపాక్స్ లక్షణాలు మొదలయ్యాయి.
జ్వరం, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో బాలుడు వైద్యుల్ని సంప్రదించాడు. అతడిని పరీక్షించిన వైద్యులు ముందు జాగ్రత్త చర్యగా శనివారం గుంటూరులోని ప్రభుత్వ ఆస్పత్రి (జీజీహెచ్)కి తరలించారు. అక్కడ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బాలుడి నుంచి నమూనాలు సేకరించి పుణేలోని ల్యాబ్‌కు పంపించారు. దీనికి సంబంధించిన ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా అనేక మంకీపాక్స్ అనుమానిత కేసులను గుర్తించినప్పటికీ, వాళ్లలో చాలా వరకు వ్యాధి లేదని తేల్చారు. దేశంలో నలుగురికి మాత్రమే మంకీపాక్స్ సోకింది.
వారిలో ముగ్గురు కేరళకు చెందిన వారు కాగా, ఒకరు ఢిల్లీకి చెందిన వారు. ఈ నలుగురిలో ఒక వ్యక్తి ఇప్పటికే పూర్తిగా కోలుకున్నాడు. కాగా, మంకీపాక్స్ విషయంలో కేంద్రం అప్రమత్తమైంది. ఎయిర్‌పోర్టుల్లో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తోంది. దీనికి వ్యాక్సిన్ తయారు చేసేందుకు కంపెనీలకు ఆహ్వానం పలికింది.