హైదరాబాద్‌లో సాహితి ఇన్‌ఫ్రాటెక్‌ నిర్వాకం..ప్లాట్ల పేరుతో భారీ మోసం..!

Spread the love

హైదరాబాద్‌లోని సాహితి ఇన్‌ఫ్రాటెక్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. తమకు న్యాయం చేయాలంటూ బాధితులంతా బైఠాయించారు. ప్లాట్ల పేరిట భారీ మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అమీన్‌పూర్ వద్ద 23 ఎకరాల్లో సదరు సంస్థ వెంచర్ ఏర్పాటు చేసింది. మొత్తం 4 వేల 3 వందల ప్లాట్లను అందుబాటులో ఉంచింది. 2019 జూన్‌లో ఫ్రీ లాంచ్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ప్లాట్ల విక్రయాన్ని ప్రారంభించింది.

ఫ్రీలాంచ్‌లో మొత్తం 12 వందల మందికి పైగా కస్టమర్లు ప్లాట్లను కొనుగోలు చేశారు. 2023 మార్చి నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి అప్పగిస్తామని సాహితి ఇన్‌ఫ్రాటెక్‌ హామీనిచ్చింది. ఐతే ఇప్పటివరకు ఆ సంస్థ ఎలాంటి నిర్మాణాలను చేపట్టలేదు. కేవలం స్థలంలో చదును మాత్రమే చేసింది. తమ ప్లాట్లను అప్పగించమని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు వాపోతున్నారు. డబుల్‌ బెడ్‌రూమ్‌కు రూ.25 లక్షలు, ట్రిబుల్ బెడ్‌రూమ్‌కు రూ.35 లక్షలు వసూలు చేసినట్లు చెబుతున్నారు.

ప్లాట్లకు మొత్తం ఒకేసారి డబ్బు మొత్తం చెల్లించామని బాధితులు అంటున్నారు. మొత్తం 2 వేల మంది బాధితులు రూ.15 వందల కోట్ల వరకు చెల్లించినట్లు తెలుస్తోంది. కట్టిన డబ్బులు అడిగితే సాహితి ఇన్‌ఫ్రాటెక్‌ ఎండీ లక్ష్మీనారాయణ బెదిరింపులకు పాల్పడుతున్నారని..కార్యాలయం ముందు బాధితులంతా బైఠాయించారు. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఫ్రీలాంచ్ సమయంలో ఎనిమిది టవర్లు చెప్పారని గుర్తు చేస్తున్నారు.ఆ తర్వాత మరో 10 టవర్లు అని మభ్య పెట్టారని..ఎప్పటికప్పుడు ప్లాన్లు మారుస్తూ వచ్చారని మండిపడుతున్నారు. కొంత మంది అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటే వారికి కూడా అరకొర డబ్బులు ఇచ్చారని చెబుతున్నారు. తాము తీసుకున్న ప్లాట్లను ఇతరులకు అమ్మకానికి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయని..అందుకే న్యాయం కోసం రోడ్డు ఎక్కామని వాపోతున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు అంటున్నారు.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com