తెలుగు వారు గర్వించదగ్గ సాహితీమూర్తి సినారె…

Spread the love

యూవత్‌ తెలుగు ప్రపం చం ఎల్లకాలం గుర్తుంచుకునే మహాకవి, తెలుగు కీర్తి, సాహితీమూర్తి డాక్టర్‌ సి.నారాయణరెడ్డి అని భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. మాతృభాషను తాను ప్రేమిస్తూ తన రచనల్లో ఈ అభిమానాన్ని ప్రతిబింబించడంతో పాటు సమాజంలో మాతృభాష ప్రాధాన్యాన్ని నొక్కిచెప్పిన మహనీయుడు సినారె అని ఆయన పేర్కొన్నారు.

రవీంద్రభారతిలో శుక్రవారం డాక్టర్‌ సి.నారాయణరెడ్డి 91వ జయంత్యుత్సవాన్ని పురస్కరించుకొని సినారె జాతీయ సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ ఒడియా రచయిత్రి డాక్టర్‌ ప్రతిభారాయ్‌కి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినారె కవిత్వం, సాహిత్యం ఎప్పుడు మానవ జీవనం, తత్వం, ప్రకృతిని ప్రేమించడం తదితర అంశాల చుట్టూనే సాగాయన్నారు.

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ తెలుగు సాహిత్య రంగంలో చెరగని ముద్ర వేసిన సినారె సేవలు చిరస్మరణీయమన్నారు. ఈ సందర్భంగా సి.నారాయణరెడ్డి రచనల సంకలనం ‘వ్యాస పూర్ణిమ’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ రచయిత్రి జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత ప్రతిభారాయ్‌కు సినారె జాతీయ పురస్కారంతో పాటు 5 లక్షల నగదు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత్రి డాక్టర్‌ ఓల్గా, నారాయణరెడ్డి ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి జి.చెన్నయ్య, సినారె కుటుంబ సభ్యులు చరణ్‌రెడ్డి, మనస్విని పాల్గొన్నారు. సభకు ముందు ప్రముఖ నృత్య గురువు దీపికారెడ్డి నిర్వహణలో ప్రదర్శించిన ‘మన భాష తెలుగు భాష, అష్టవిధి శృంగార నాయికలు’ రూపకాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com