
న్యూఢిల్లీ: బెంగాల్ టీచర్ స్కామ్‌లో మంత్రి పార్ధాతో పాటు అర్పిత ముఖర్జీ అరెస్టు అయిన విషయం తెలిసిందే. అర్పిత రెండు ఇండ్ల నుంచి సుమారు 50 కోట్ల నగదును ఈడీ సీజ్ చేసింది. అయితే ఇప్పుడు ఆమె వద్ద ఉన్న నాలుగు లగ్జరీ కార్ల గురించి ఈడీ వేటాడుతోంది. ఆ కార్లలో భారీ మొత్తంలో నగదు దాచిపెట్టి ఉంటారని తెలుస్తోంది. అర్పితకు ఆడీ ఏ4, హోండా సిటీ, హోండా సీఆర్వీ, మెర్సిడీజ్ బెంజ్ కార్లు ఉన్నాయి. ఆ కార్ల నిండా నోట్ల కట్టలు ఉన్నట్లు ఈడీ భావిస్తోంది. అర్పితకు చెందిన ఓ వైట్ మెర్సిడీజ్ కారును సీజ్ చేశారు. సీసీటీవీ ఫూటేజ్ ద్వారా ఆ వాహనాలను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.మోడల్ అర్పిత ముఖర్జీ పేరిట చాలా ఫ్లాట్లు ఉన్నాయి. వాటికి సంబంధించిన సేల్ డీడ్స్ కూడా లభ్యమైనట్లు ఈడీ చెప్పింది. స్కూల్ జామ్ స్కామ్‌తో లింకున్న అర్పితను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. క్లబ్‌టౌన్ హైట్స్, బెల్గారియాలో అర్పితకు ఇండ్లు ఉన్నాయి. గురువారం ఉదయం ఈ ఫ్లాట్లలోనే తనిఖీలు సాగాయి. ఓ ఫ్లాట్ నుంచి 30 కోట్ల నగదు, అయిదు కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. మరో ఫ్లాట్‌లో మాత్రం ఏమీ దొరకలేదు. గత శుక్రవారం డైమండ్ సిటీ కాండోలో ఉన్న ఫ్లాట్‌లో 21 కోట్లను సీజ్ చేసిన విషయం తెలిసిందే.