
1. కొత్త స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని ఓ బాలుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గొల్లపల్లి మండలంలోని గుంజపడుగులో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. గ్రామానికి చెందిన విద్యార్థి(16) తొమ్మిదో తరగతి వరకు చదువుకుని గత కొన్ని రోజులుగా ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈక్రమంలో స్మార్ట్ ఫోన్లో వీడియోగేములకు అలవాటుపడ్డాడు. ఈక్రమంలో తనకు కొత్త స్మార్ట్ ఫోన్ కావాలంటూ బాలుడు పదే పదే అడుగుతుండగా వారం రోజుల్లో కొనిస్తానని తండ్రి చెప్పాడు. ఇక తనకు ఫోన్ కొన్నివారేమోనని బాధ పడ్డ బాలుడు గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. కొనఊపిరితో ఉన్న బాలుడిని కుటుంబ సభ్యులు జగిత్యాల ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
2. అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట పరిధిలో చోటుచేసుకుంది. రామగిరి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సతీశ్, శివ, రాజకుమార్ స్నేహితులు. కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సతీశ్ రోజువారీ మాదిరిగానే బుధవారం మండలంలోని ఆదివారంపేటకు కూలీ పనికి వెళ్లి ఇంటికి వచ్చాడు. కొద్దిసేపటికే శివ, రాజకుమార్ ద్విచక్ర వాహనంపై సతీష్ ఇంటికి వచ్చి తీసుకెళ్లారు. రాత్రి 10 దాటినా కుమారుడు ఇంటికి రాకపోవడంపై కుటుంబసభ్యులు ఆందోళన చెందుతుండగా 12 గంటల ప్రాంతంలో సతీశ్ సమీప బంధువైన అశోక్.. సతీశ్ ఇంటికి వచ్చి తండ్రి మధునయ్యను ఆరా తీశాడు. చాలా సేపటి నుంచి సతీశ్ కోసం ఎదురు చూస్తున్నామని మధునయ్య చెప్పడంతో, అశోక్ వీరిని ఎస్సారెస్పీ డీ83 కెనాల్ గేట్ వద్దకు తీసుకెళ్లాడు. ఎస్సారెస్పీ కాలువలో పడి ఉన్న సతీష్ ను తండ్రి బయటకు తీసి చూడగా అతను అప్పటికే మృతి చెందాడు. మృతుడి కుడి చెవి నుంచి రక్తం కారుతూ, గాయం ఉండగా… కాలువ ర్యాంప్ పై రక్తపు మరకలు, మద్యం సీసా ముక్కలు, చెప్పులు ఉన్నాయి. సతీశ్, శివ, రాజకుమార్ మద్యం సేవించారని, మద్యం మత్తులో తమ కుమారుడిని స్నేహితులే హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడి తండ్రి మధునయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
3. ఆత్మహత్య చేసుకునేందుకు రైలు పట్టాలపై నిలుచున్న ఓ వ్యక్తి రైలు ఢీకొట్టడంతో ప్రాణాలతో భయపడ్డా.. రెండు కాళ్ళు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన పెద్దపల్లిలో గురువారం నాడు చోటుచేసుకుంది. పెద్దపల్లి పట్టణంలోని తెనుగువాడకు చెందిన చిగురు ఓదెలు(38) భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. తరచూ భార్యతో గొడవలు, ఆర్ధిక సమస్యలు తలెత్తడంతో తీవ్ర మనోవేదనకు గురైన ఓదెలు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునేందుకు కూనారం గేటు వైపు వెళ్లాడు. రైలు వస్తున్న సమయంలో పట్టాలపై నిలబడిన ఓదెలు అది ఢీకొట్టిన వేగానికి పక్కకు పడిపోవడంతో రెండు కాళ్లు రైలు కింద పడి తెగిపోయాయి. దూరం నుంచి ఇది గమనించిన స్థానికులు 108 సిబ్బందికి సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడి, అపస్మారక స్థితికి చేరుకున్న ఓదెలుకు పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యంకోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.