
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం పలు పథకాలను అమలు చేస్తోంది. ఇప్పటికే రైతు భరోసాతో పాటు ఏ సీజన్ లో జరిగిన నష్టానికి అదే సీజన్లో పరిహారం చెల్లిస్తోంది. అలాగే రైతు భరోసా కేంద్రాల ద్వారా వారికి దిశానిర్దేశం చేస్తోంది.వీటితో పాటు రైతులను ఆధునిక వ్యవసాయంవైపు ప్రోత్సహించేందుకు వైఎస్ఆర్ రైతు రథం, వైఎస్ఆర్ యంత్ర సేవా పథకాల ద్వారా సబ్సిడీపై ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్ర పరికరాలను అందిస్తోంది. ఇప్పటికే టాక్టర్ల పంపిణీ కొనసాగుతుండగా.. యంత్రపరికరాల పంపిణీకి సంబందించిన కసరత్త జరుగుతోంది. వీటితో పాటు వ్యవసాయానికి మరింత ఆధునికత జోడించడంతో పాటు రైతులకు మరింత సులభమయ్యే పద్ధతులను అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకోసం డ్రోన్ల సాగును అందుబాటులో తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో రైతులకు సబ్సిడీపై డ్రోన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మండలానికి మూడు చొప్పున డ్రోన్లను పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. డ్రోన్ల వల్ల పురుగు మందుల పిచికారీ పనులు మరింత సులభతరం కానున్నాయి. ఐదుగురు చేసేపనిని ఒక్కడ్రోన్ పూర్తి చేస్తోంది. దీని వల్ల నీళ్లు, పురుగు మందుల ఖర్చు, సమయాన్ని తగ్గించే అవకాశముంది. అలాగే పొలంలోని మొక్కలన్నింటికీ సమానంగా మందు పిచికారీ చేసే అవకాశముంటుంది. ముఖ్యంగా మామిడి, చీని, కొబ్బరి, బొప్పాయి, దానిమ్మ, అరటి వంటి ఉద్యాన పంటలకు మందులు పిచికారీ చేయడం మరింత సులభతరం కానుంది.రైతు సహకార సంఘాల ధ్వారా డ్రోన్ల కొనుగోలుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులకు, మహిళా రైతులు డ్రోన్ల సబ్సిడీ పథకానికి అర్హులుగా పేర్కొంది. వీరికి డ్రోన్ల కొనుగోలుకు 40 శాతం వరకు సబ్సిడీ ఇస్తుంది.అగ్రికల్చర్, హార్టీకల్చర్ బీఎస్సీ చదిన వారికి 50 శాతం సబ్సిడీ ఇస్తుంది. ఒక్కో డ్రోన్ ధర రూ.6లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. దీన్ని బట్టి ఒక్కో డ్రోన్ పై రూ.3.60 లక్షల నుంచి రూ.5లక్షల వరకు సబ్సిడీ వచ్చే అవకాశముంది.