మంచినీళ్లు తాగుతున్నా రక్తమే కనిపిస్తోంది: ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది

Spread the love
  • ఒడిశా భీతావహ దృశ్యాలకు మానసికంగా కుదేలవుతున్న ఎన్డీఆర్ఎఫ్ ఉద్యోగులు
  • వారికి నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పిస్తున్న అధికారులు
  • సిబ్బంది శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలన్న డీజీ

మానసికపరమైన అశాంతి. ఏదో తెలియని భయం, భ్రాంతి. తినడానికి ముద్ద కూడా సహించడం లేదు. ఒడిశాలో ఘోర రైలు ప్రమాద ఘటన స్థలంలో సహాయక, పునరుద్ధరణ చర్యల్లో పాల్గొన్న నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితి ఇది. గత శుక్రవారం జరిగిన ఘోర ప్రమాదం అనంతరం సుమారు తొమ్మిది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. నాటి ప్రమాదంలో 288 మంది మరణించగా, వెయ్యి మందికి పైగా గాయపడడం తెలిసిందే.

తెగిపడిన అవయవాలు, మాంసం ముద్దలు, రక్తపు మడుగుతో ప్రమాద స్థలం భీతావహంగా ఉండడంతో నాటి దృశ్యాలే సిబ్బంది కళ్ల ముందు కదలాడుతున్నాయి. ఆ ఘోర దృశ్యాలను మర్చిపోయి మామూలు స్థితికి రాలేకపోతున్నారు. దీంతో వీరికి నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు. ఈ వివరాలను ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ అతుల్ కర్వాల్ వెల్లడించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సుమారు 44 మందిని కాపాడగా, 121 మృతదేహాలను వెలికితీసింది.

‘‘బాలాసోర్ రైలు ప్రమాదం సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బందిని కలుసుకున్నాను. మంచినీళ్లు తాగుతున్న ప్రతిసారీ తనకు రక్తమే కనిపిస్తున్నట్టుందని ఓ ఉద్యోగి చెప్పాడు. సహాయక చర్యల తర్వాత తనకు ఆకలే వేయడం లేదని మరో ఉద్యోగి తెలిపాడు. బృందాలు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి. ఇందుకోసం పలు కార్యక్రమాలు చేపట్టాం. కౌన్సెలింగ్ సెషన్లు నిర్వహిస్తున్నాం. టర్కీ భూకంపం సహాయక కార్యక్రమాల్లో పాల్గొని తిరిగొచ్చిన సిబ్బందికీ ఇదే విధమైన కార్యక్రమాలు నిర్వహించాం’’ అని చెప్పారు ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ అతుల్ కర్వాల్.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com