
తెలుగుదేశం పార్టీ(టీడీపీ) రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డిపై దుండగులు దాడికి యత్నించారు.టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి కార్యాలయం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసినట్లుగా తెలుస్తోంది.

ఆదివారం మధ్యాహ్నం సుమారు 1.10 గంటల సమయంలో బీవీనగర్‌లో ఉన్న కిలారి వెంకటస్వామి అపార్ట్‌మెంట్లోని తన కార్యాలయం నుంచి కిందికి దిగుతున్న ఆనం వెంకట రమణారెడ్డిపై కొందరు కర్రలతో దాడి చేసేందుకు యత్నించినట్లుగా సమాచారం. ఇది గమనించిన ఆనం వెంకట రమణారెడ్డి అనుచరులు వారిని ప్రతిఘటించారు. స్థానికుల కేకలతో అక్కడి నుంచి వారు పారిపోయినట్లుగా తెలుస్తోంది.
వారు తీసుకొచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు, కర్రలు అక్కడే వదిలి వెళ్లిపోయారు. ఈ సమయంలో ఆనం పక్కనే ఉన్న ఎంపీటీసీ మాజీ సభ్యుడు సికిందర్‌రెడ్డి కింద పడిపోవడంతో ఆయన్ను ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, టీడీపీ నాయకుడు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి అక్కడికి చేరుకొని ఘటనపై ఆరా తీశారు.