22/04/2021

ట్రాఫిక్ పోలీసులతో వాదిస్తూ, గుండెపోటుతో మరణించిన ఐటీ ఉద్యోగి

నిబంధనలను మీరి వాహనం నడుపుతున్నావంటూ, భారీ జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులతో వాదిస్తూ, ఓ ఐటీ ఉద్యోగి గుండెపోటుతో మరణించగా, సోషల్ మీడియాలో కేంద్ర ప్రభుత్వ వైఖరి, నూతన జరిమానాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నోయిడా ప్రాంతానికి చెందిన 35 సంవత్సరాల ఉద్యోగి, ఘజియాబాద్ సమీపంలో తన కారులో, వృద్ధులైన తల్లిదండ్రులతో కలిసి వెళుతుండగా, ఓ ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని ఆపారు. పత్రాల కోసం నిలదీశారు. దీంతో పోలీసులకు, అతనికి మధ్య వాగ్వాదం జరుగగా, హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. అతన్ని ఆసుపత్రికి తరలించినప్పటికీ, ప్రాణాలు దక్కలేదు.

జరిగిన ఘటనపై ఉద్యోగి తండ్రి మాట్లాడుతూ, “దేనికైనా ఓ పద్ధతి ఉంటుంది. ట్రాఫిక్ నిబంధనలు మారడం మంచిదే. అయితే, ఓ పోలీసులు కనీస హుందాను ప్రదర్శించాలి. ఎవరి వాహనాన్నైనా తనిఖీ చేయాలని భావిస్తే ఓ పద్ధతి ఉంటుంది. నా  కుమారుడు ఏమీ ర్యాష్ డ్రైవింగ్ చేయలేదు. కారులో కనీసం ఇద్దరు వృద్ధులు ఉన్నారని కూడా ఆ పోలీసులు చూడలేదు. ఆ పోలీసులు ప్రవర్తించిన తీరుకు మద్దతిచ్చేలా నిబంధనలు ఉంటాయని నేను భావించడం లేదు” అన్నారు.

ట్రాఫిక్ పోలీసులు అలా ప్రవర్తించడాన్ని తన జీవితంలో చూడలేదని, ఇప్పుడు తాను కుమారుడిని కోల్పోయానని విలపిస్తూ చెప్పాడు. తనకు దిక్కెవరని వాపోయాడు. ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్ లు తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు.

జరిగిన ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించామని నోయిడా పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మృతుడికి షుగర్ వ్యాధి ఉందని, ఆ కారణంతోనే గుండెపోటుతో మరణించాడని తమ ప్రాథమిక విచారణలో తేలిందని, ఘటనపై విచారణ జరుగుతోందని గౌతమ్ బుద్ధా నగర్ సీనియర్ ఎస్పీ వైభవ్ కృష్ణ తెలిపారు. ఇక ఈ ఘటన గురించి తెలుసుకున్న సామాజిక మధ్యమ లోకం భగ్గుమంది. పోలీసుల వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: