Heavy Rains | రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో సోమవారం అర్ధరాత్రి తర్వాత భారీ వర్షం కురిసింది. వికారాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్, రంగారెడ్డి, హన్మకొండ, సిద్ధిపేట జిల్లాల్లోతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా వికారాబాద్లో 13 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. మద్గుల్ చిట్టెంపల్లిలో 12.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సర్పన్పల్లి ప్రాజెక్టు జలకళను సంతరించుకున్నది. భారీ వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. తాండూరుకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు జిల్లాల్లో ఆయా ప్రాంతాల్లో ఎనిమిది సెంటీమీటర్లకుపైగా వర్షాపాతం నమోదైంది.
గోదావరికి పెరిగిన వరద
నిర్మల్ జిల్లా బాసరలో రైల్వేస్టేషన్ ప్రాంతంలో వర్షాలకు నీరంతా నిలిచిపోయింది. గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. మహబూబాబాద్ అర్పనపల్లి వద్ద వట్టివాగు పొంగి ప్రవహిస్తున్నది. కేసముద్రం – గూడూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.హైదరాబాద్ జంట నగరాల పరిధిలోని వర్షం దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.