పదేళ్ల కిందట అవినీతిలో పోటీ ఉండేది.. గత ప్రభుత్వాలపై ప్రధాని విమర్శలు

Spread the love
  • సీబీఐ డైమండ్ జూబ్లీ వేడుకలకు హాజరైన ప్రధాని మోదీ
  • న్యాయానికి బ్రాండ్ అంబాసిడర్ గా సీబీఐ మారిందని వ్యాఖ్య
  • తన పనితనం, నైపుణ్యం ద్వారా ప్రజలకు విశ్వాసం కల్పించిందని వెల్లడి
  • ప్రజాస్వామ్యానికి, న్యాయవ్యవస్థకు అవినీతి పెద్ద అవరోధంగా మారిందని విమర్శ

అవినీతి అనేది ప్రజాస్వామ్యానికి, న్యాయవ్యవస్థకు పెద్ద అవరోధంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘సమర్థవంతమైన సంస్థలు లేకుండా అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడం సాధ్యం కాదు. కాబట్టి సీబీఐకి పెద్ద బాధ్యత ఉంది’’ అని అన్నారు. అవినీతి నుంచి భారత్‌కు విముక్తి కల్పించడమే సీబీఐ చేయాల్సిన అతిముఖ్యమైన పని అని అన్నారు.

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైమండ్ జూబ్లీ వేడుకల్లో ప్రధాని మాట్లాడారు. నల్లధనం, బినామీ ఆస్తులపై బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే యుద్ధం ప్రారంభించిందని తెలిపారు. అవినీతిపరులతో పాటు, అవినీతికి గల కారణాలపైనా తాము పోరాడుతున్నామని చెప్పారు.

‘‘పదేళ్ల కిందట అవినీతికి పాల్పడేందుకు పోటీ ఉండేది. ఆ సమయంలో పెద్దపెద్ద కుంభకోణాలు జరిగాయి. వ్యవస్థలు అనుకూలంగా ఉండటంతో నిందితులు భయపడేవారు కాదు. ఇప్పటికీ వాళ్లు కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. మీరు (అధికారులు) మీ పనిపై దృష్టి పెట్టండి. అవినీతిపరుల్ని వదలొద్దు’’ అని సూచించారు.

దేశ అభివృద్ధిలో సీబీఐది కీలక పాత్ర అని అన్నారు. న్యాయానికి బ్రాండ్ అంబాసిడర్ గా సీబీఐ మారిందని మోదీ చెప్పారు. అందుకే న్యాయం కోసం ప్రతి ఒక్కరూ సీబీఐ విచారణ కావాలని డిమాండ్  చేస్తుంటారని అన్నారు. ‘‘ఈ రోజుకు కూడా.. ఏదైనా కేసు పరిష్కారం కాకపోతే.. దాన్ని సీబీఐకి అప్పగించాలని డిమాండ్లు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. సీబీఐ తన పనితనం, నైపుణ్యం ద్వారా ప్రజలకు విశ్వాసం కల్పించింది’’ అని వివరించారు.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com