జోడో యాత్రలో వ్యాఖ్యలపై రాహుల్ గాంధీకి ఢిల్లీ పోలీసుల నోటీసులు

Spread the love
  • శ్రీనగర్ లో మహిళల సమస్యలపై మాట్లాడిన రాహుల్
  • వారు ఇప్పటికీ లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని వ్యాఖ్య
  • బాధితుల వివరాలను కోరిన ఢిల్లీ పోలీసులు

భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శ్రీనగర్‌లో మహిళల సమస్యల గురించి  చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. శ్రీనగర్ లో రాహుల్ ‘మహిళలు ఇప్పటికీ లైంగిక వేధింపులకు గురవుతున్నారు’ అని వ్యాఖ్యానించారు.బాధితుల వివరాలు ఇస్తే తాము చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. రాహుల్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల ఆధారంగా పోలీసులు రాహుల్ కు పలు ప్రశ్నలతో కూడిన నోటీసు పం పించారు. లైంగిక వేధింపుల గురించి ఆయనను సంప్రదించిన మహిళల గురించి వివరాలు ఇవ్వాలని కోరారు. శ్రీనగర్‌లో భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘మహిళలపై ఇప్పటికీ లైంగిక వేధింపులు జరుగుతున్నాయని విన్నాను’ అని అన్నారు.

సదరు బాధితుల వివరాలను తెలియజేయాలని, తద్వారా వారికి భద్రత కల్పించవచ్చని పోలీసులు పేర్కొన్నారు. చట్ట ప్రకారం నోటీసుకు తగిన సమయంలో స్పందిస్తామని కాంగ్రెస్ తెలిపింది. ‘ప్రధాని మోదీ, అదానీల సంబంధాలపై రాహుల్ గాంధీ ప్రశ్నలతో ఈ ప్రభుత్వం తన పోలీసుల వెనుక దాక్కుంది. భారత్ జోడో యాత్ర పూర్తయిన 45 రోజుల తర్వాత ఢిల్లీ పోలీసుల నోటీసుల ద్వారా మహిళల వివరాలను కోరుతోంది. రాహుల్ ను కలిసిన మహిళలు ఎవరు? వారు ఎదుర్కొన్న హింస ఏమిటని అడుగుతోంది. మేము నోటీసులకు చట్ట ప్రకారం తగిన సమయంలో స్పందిస్తాము. ప్రభుత్వం భయాందోళనలో ఉన్నట్టు ఈ నోటీసు ద్వారా అర్థం అవుతోంది. ప్రజాస్వామ్యం, మహిళా సాధికారత, భావప్రకటన స్వేచ్ఛ , ప్రతిపక్ష పాత్రను బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తోంది’ అని ట్వీట్ లో పేర్కొంది.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com