ఉమాశంకర్‌రెడ్డి భార్య స్వాతి హత్యకు యత్నం.. నిందితులకు 14 రోజుల రిమాండ్

Spread the love
  • వివేకా హత్య కేసులో ఉమాశంకర్‌రెడ్డిపై ఆరోపణలు
  • స్వాతి ఇంట్లోకి ప్రవేశించి గొంతు నులిమి దాడి
  • వివేకా హత్యను జీర్ణించుకోలేక దాడి చేశామని అంగీకరించిన నిందితులు
Jammalamadugu Court remands Swathi attackers
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు ఉమాశంకర్‌రెడ్డి భార్య స్వాతి హత్యకు యత్నించిన కేసులో ఇద్దరు నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పులివెందులలోని పాత ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ ఇంట్లో నివసిస్తున్న స్వాతిపై ఈ నెల 4న హత్యాయత్నం జరిగింది. సింహాద్రిపురం మండలం కసనూరుకు చెందిన కొమ్మా పరమేశ్వరరెడ్డి, ఆయన కుమారుడు సునీల్‌కుమార్‌రెడ్డి స్వాతి ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి ఆమెపై దాడికి పాల్పడ్డారు.

వివేకాను చంపేసి ప్రశాంతంగా కూర్చున్నారా? అంటూ తన గొంతు నులిమి చెప్పుతో కొట్టి చంపేందుకు ప్రయత్నించారని స్వాతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరమేశ్వరరెడ్డి, సునీల్ కుమార్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరాన్ని ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు.

వివేకా హత్యను జీర్ణించుకోలేకపోయామని, ఉమాశంకర్‌రెడ్డిపై ఏర్పడిన కోపంతోనే ఆయన భార్యపై దాడికి యత్నించినట్టు నిందితులు అంగీకరించారని పోలీసులు పేర్కొన్నారు. నిన్న వారికి జమ్మలమడుగు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించినట్టు చెప్పారు.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com