మంత్రులు బుగ్గన, గుడివాడలపై జగన్ ప్రశంసలు

Spread the love
  • గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను బాగా నిర్వహించారని కితాబు
  • ఎంఓయూలను అమలు చేసే దిశగా చర్యలను ప్రారంభించిన ప్రభుత్వం
  • సీఎస్ అధ్యక్షతన కమిటీ వేసిన సీఎం
విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను గొప్పగా నిర్వహించారంటూ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్ నాథ్ లను ముఖ్యమంత్రి జగన్ ప్రశంసించారు. వీరితో పాటు పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలవెన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజనలపై కూడా ప్రశంసలు కురిపించారు.

ఈనెల 3, 4 తేదీల్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ లో రూ. 13.41 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 378 ఒప్పందాలు జరిగాయి. ఈ పెట్టుబడుల కారణంగా 6.09 లక్షల మందికి ఉపాధి లభించనుంది. ఈ క్రమంలో ఎంఓయూలను అమలు చేసే దిశగా ప్రభుత్వం ఇప్పటికే చర్యలను ప్రారంభించింది.

దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జగన్ ఒక కమిటీని వేశారు. ఈ కమిటీ ఈరోజు సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈ కమిటీ ప్రతి వారం సమావేశమై కుదిరిన ఒప్పందాల అమలు దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com