ప్రీతి ఆత్మహత్య వ్యవహారంపై గవర్నర్ తమిళిసై సీరియస్

Spread the love
  • కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థిని ప్రీతి విషాదాంతం
  • వేధింపుల కారణంగా ఆత్మహత్యాయత్నం చేసిన ప్రీతి
  • చికిత్స పొందుతూ మృతి
  • నిమ్స్ కు తరలించడంతో సమయం వృధా అయిందన్న గవర్నర్
  • వరంగల్ కే వైద్య నిపుణులను తరలించి ఉంటే బాగుండేదని వెల్లడి
Governor reacts on Preethi suicide issue
ర్యాగింగ్, వేధింపులతో ఆత్మహత్యాయత్నం చేసిన మెడికో ప్రీతి చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే.

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ వైద్య విద్య అభ్యసిస్తున్న ప్రీతి అధికమొత్తంలో మత్తుమందు తీసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లగా, ఆమెను తొలుత వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి, అక్కడ్నించి హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. అయితే నిమ్స్ వైద్య నిపుణులు తీవ్రంగా శ్రమించినా ప్రీతిని బతికించలేకపోయారు.

ఈ నేపథ్యంలో, ప్రీతి ఆత్మహత్య వ్యవహారంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్రంగా స్పందించారు. ప్రీతి మరణంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు కాళోజీ యూనివర్సిటీకి రాజ్ భవన్ లేఖ రాసింది.

ప్రీతిని వరంగల్ ఎంజీఎం నుంచి నిమ్స్ కు తరలించడంతో ఎంతో విలువైన సమయం కోల్పోయినట్టయిందని గవర్నర్ అభిప్రాయపడ్డారు. అలాకాకుండా, ప్రీతిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోనే ఉంచి, హైదరాబాద్ నుంచి నిపుణులైన వైద్యులను, వైద్య పరికరాలను అక్కడికే తరలించి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు.

ఇక, విద్యాసంస్థల్లో ర్యాగింగ్ లు, వేధింపులకు సంబంధించిన ఎస్ఓపీలపై పూర్తి వివరాలతో నివేదిక అందించాలని కాళోజీ వర్సిటీని లేఖలో ఆదేశించారు. వైద్య కళాశాల్లో మెడికోలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పనిగంటల వివరాలతో పాటు మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, పనితీరు తదితర అంశాలపై నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com