
- ఆదాలకు వేల కోట్లు ఉండొచ్చు.. తనకు ప్రజాభిమానం ఉందన్న కోటంరెడ్డి
- ఇప్పటికైనా ఒకే పార్టీలో ఉండాలంటూ ఆదాలకు హితవు
- మేయర్, కార్పొరేటర్లతో కలసి బలప్రదర్శన చేసిన కోటంరెడ్డి

పులివెందుల రౌడీ జగన్, నెల్లూరు రౌడీ కోటంరెడ్డి అని గతంలో ఆదాల చేసిన విమర్శలు అందరికీ గుర్తున్నాయని చెప్పారు. ఇలాంటి వ్యక్తి వైసీపీలోనే కొనసాగుతారనే నమ్మకం తనకు లేనట్టుగా కోటంరెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ఒకే పార్టీలో ఉండాలని… గతంలో మాదిరి అన్ని పార్టీలు తిరగొద్దని ఎద్దేవా చేశారు. ఆదాలకు వేల కోట్ల ఆస్తులు ఉండొచ్చని… తనకు అంతకంటే విలువైన నియోజకవర్గ ప్రజల అభిమానం ఉందని చెప్పారు. తాను ఎవరినీ శత్రువుగా భావించనని… కేవలం రాజకీయ పోటీదారుడిగానే చూస్తానని అన్నారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తాను కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశానని… తన మాదిరే వైసీపీ ప్రభుత్వం కూడా విచారణను ఎందుకు కోరడం లేదని కోటంరెడ్డి ప్రశ్నించారు. కేంద్ర సంస్థలు విచారణ జరిపితే తన మాదిరే ఇంకెంత మంది ఫోన్లు ట్యాప్ అయ్యాయనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. నెల్లూరు మేయర్ సహా 11 మంది కార్పొరేటర్లు తన వెంట ఉన్నారని తెలిపారు. అంతేకాదు… మేయర్, కార్పొరేటర్లతో కలిసి తన బలాన్ని ప్రదర్శించారు.