Razakar Files: విజయేంద్ర ప్రసాద్‌తో బీజేపీ నేతల భేటీ.. ‘రజాకార్ ఫైల్స్’ మూవీ ఫిక్స్?

Spread the love

‘కశ్మీర్ ఫైల్స్’ దేశాన్ని ఓ ఊపు ఊపేసిన సినిమా. ఈ మూవీని నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఇప్పుడు ‘ఢిల్లీ ఫైల్స్’ పేరుతో ఇందిరాగాంధీ మరణానంతరం జరిగిన శిక్కుల ఉచకోత మీద ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనికి కూడా వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అయితే ‘కశ్మీర్ ఫైల్స్’ తరహాలోనే హైదరాబాద్ స్వాతంత్రోద్యమంతో ముడిపడిన రజాకార్ల ఆగడాలు సైతం తెరకెక్కించాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ యోచిస్తున్నారు.తాజాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి కోటాలో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ను రాజ్యసభకు ఎంపిక చేసింది.ఈ నేపథ్యంలోనే ఆదివారం ఆ పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్‌తో పాటు బండి సంజయ్ తదితరులు విజయేంద్ర ప్రసాద్‌ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ క్రమంలోనే ‘రజాకార్ ఫైల్స్’ మూవీ గురించి వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.విజయేంద్రప్రసాద్ గతంలో రజాకార్ల ఆగడాలు, అకృత్యాల నేపథ్యంలో నాగార్జున హీరోగా ‘రాజన్న’ తెరకెక్కించారు. ఈ సినిమాకు ఆయన కథ అందించడంతో పాటు దర్శకత్వం కూడా వహించారు. ఈ క్రమంలోనే ‘రజాకార్ ఫైల్స్’ సినిమాకు ఆయన్ని కథ తయారుచేయాలని బండి సంజయ్ కోరినట్లుగా తెలుస్తోంది.

అయితే ‘రజాకార్ ఫైల్స్’కు విజయేంద్ర ప్రసాద్ కథ మాత్రమే అందిస్తారా… దర్శకత్వం కూడా వహిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. ఈ సినిమా కథకి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తే.. ‘కశ్మీర్ ఫైల్స్’ నిర్మాత అభిషేక్ అగర్వాలే నిర్మిస్తారని ప్రజారం జరుగుతోంది. చారిత్రక నేపథ్యం గల ఈ సినిమాను తీయడానికి చాలా సమయమే పట్టే అవకాశముంది. ఇప్పటికిప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించినా సినిమా పూర్తికావడానికి కనీసం ఏడాది సమయమైనా పడుతుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సినిమాని ట్రంప్ కార్డుగా వాడుకోవాలన్నది బండి సంజయ్ ప్లాన్. దీంతో ‘రజాకార్ ఫైల్స్’ సినిమాని జనవరి లేదా ఫిబ్రవరి నాటికే విడుదలకు సిద్ధం చేస్తే బాగుంటుందని విజయేంద్ర ప్రసాద్‌తో చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాపై విజయేంద్రప్రసాద్ గానీ, అభిషేక్ అగర్వాల్‌ గానీ అధికారికంగా ప్రకటిస్తే తప్ప ఇందులో ఎంత నిజముందో తెలియదు.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com