
- గతరాత్రి గన్నవరం నుంచి హైదరాబాద్ వెళ్లిన చంద్రబాబు
- అదే విమానంలో వైసీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి
- చంద్రబాబు పక్కసీట్లోనే కూర్చున్న షేక్ మీరావలి
- జై చంద్రబాబు అంటూ నినాదం
- తమకు అమరావతే కావాలంటూ స్పష్టీకరణ

“ఇవాళ నాతో ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాత నారా చంద్రబాబునాయుడు గారు ఫ్లయిట్ జర్నీ చేస్తున్నారు. ఆయన చార్టర్డ్ విమానాల్లో తిరుగుతుంటారని, రాజధాని నిర్మాణం కోసం డబ్బులు వృథా చేస్తుంటారని చాలామంది చెబుతుంటారు. కానీ అదంతా నిజం కాదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమని భావించే వ్యక్తి ఆయన. నేను వైసీపీ అయినా సరే ఆయన నా పక్కనే కూర్చుని ప్రయాణం చేస్తున్నారు” అని వివరించారు.
మీరావలి ఇండిగో విమానంలో తన సహ ప్రయాణికుడిగా ఉన్న చంద్రబాబుకు తనను తాను పరిచయం చేసుకున్నారు.
“నా పేరు మీరావలి సార్… మాది పెదకూరపాడు నియోజకవర్గం. రాజధాని గురించి మీరు చేసిన కృషి ఆనందదాయకం. మాకు మా రాజధాని కావాలి… అది కూడా అమరావతే కావాలి. జై అమరావతి, జై చంద్రబాబునాయుడు. నేను వైసీపీ అని చెప్పిన తర్వాత కూడా ఆయన నా పక్కన కూర్చున్నారు. ఆయన వ్యక్తిత్వానికి ఇది నిదర్శనం. చంద్రబాబు వంటి వ్యక్తి మనందరికీ కావాలి. ఇక్కడ రాజకీయాలు ముఖ్యం కాదు” అంటూ మీరావలి వ్యాఖ్యానించారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండిగో విమానం గతరాత్రి గన్నవరం నుంచి హైదరాబాద్ వెళుతున్న సందర్భంగా ఈ సంభాషణ జరిగింది.