
- అనేక సురేంద్రన్ ప్రధాన పాత్రధారిగా ‘బుట్టబొమ్మ’
- వైవిధ్యం లేని కథ .. బలహీనమైన స్క్రీన్ ప్లే
- కథా భారం మొత్తం అనిఖపైనే
- తన మార్క్ నటనతో మెప్పించిన అర్జున్ దాస్
- సరిగ్గా డిజైన్ చేయని ఇతర పాత్రలు
- ఫొటోగ్రఫీకి .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి మంచి మార్కులు

అరకు సమీపంలోని ‘దూదికొండ’ అనే పల్లెలో సత్య (అనిఖ) కుటుంబం నివసిస్తూ ఉంటుంది. వాళ్లది మధ్యతరగతి కుటుంబం .. సత్య తండ్రి చిన్నీ అనే యువకుడికి చెందిన మిల్లులో పనిచేస్తూ ఉంటాడు. సత్యను చిన్నీ ప్రేమిస్తూ ఉంటాడు. తమ స్థాయికి సత్య ఫ్యామిలీ తూగదు అని చెప్పేసి చిన్ని తల్లి నిరాకరిస్తూ ఉంటుంది. సత్యకి రెండు కోరికలు ఉంటాయి .. ఒకటి కెమెరా ఉన్న సెల్ ఫోన్ కొనుక్కోవాలనీ .. రెండవది బీచ్ ను చూడాలని.
ఒకసారి సత్య ఎవరికో కాల్ చేయబోతే అది మురళి (సూర్య వశిష్ఠ)కు వెళుతుంది. అతను విశాఖ సమీపంలోని ఒక గ్రామంలో ఆటో నడుపుకుంటూ ఉంటాడు. వాళ్లిద్దరి మధ్య మాటలు కలుస్తాయి. ఒకరిని ఒకరు ప్రత్యక్షంగా చూసుకోకపోయినా వాళ్ల మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది. తమ ప్రేమను గురించి స్నేహితురాలైన బేబీకి సత్య చెబుతుంది. ముక్కూమొహం తెలియని వ్యక్తిని ప్రేమించవద్దని చెప్పినా సత్య వినిపించుకోదు. ఈ లోగా సత్యను పెళ్లి చేసుకోవాలనుకున్న చిన్నీ, ఈ విషయంలో తల్లిని ఒప్పిస్తాడు.
ఈ విషయం తెలిసి తమ కూతురు శ్రీమంతుల ఇంటికి కోడలు కాబోతోందని సత్య పేరెంట్స్ సంబరపడతారు. అయితే చిన్నీతో పెళ్లి ఇష్టం లేని సత్య, తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయం చూసి .. మురళిని కలుసుకోవడానికి వైజాగ్ వెళుతుంది. బస్టాండులో దిగి మురళి కోసం వెయిట్ చేస్తున్న సత్య దగ్గరికి ఆర్కే (అర్జున్ దాస్) వస్తాడు. అతనే మురళి అనుకుని వెంటనడుస్తుంది సత్య. ఆర్కే ఎవరు? సత్యతో అంతకుముందు ఎలాంటి పరిచయం లేని అతను ఆమె కోసం ఎందుకు వచ్చాడు? మురళిని నమ్మి వచ్చిన ఆమెకి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనేదే కథ.
మలయాళంలో ఆ మధ్య వచ్చిన ‘కప్పేలా ‘ సినిమా అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమాకి ఇది రీమేక్. సాధారణంగా ఏ కథ అయినా నెమ్మదిగా మొదలై ఆ తరువాత అది చిక్కబడుతూ వెళుతుంది. ఇంటర్వెల్ సమయానికి ఆడియన్స్ లోని ఉత్కంఠను ఒక రేంజ్ కి తీసుకుని వెళ్లి, ఆ తరువాత నుంచి మరింత స్పీడ్ గా నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళుతుంది. కానీ ఈ కథ ఎలా నింపాదిగా మొదలైందో .. అంతే తాపీగా ముగుస్తుంది.
కథలో ఎక్కడా ఎలాంటి ట్విస్టులు లేవు .. థియేటర్లో ఉన్న ఆడియన్స్ అంచనాలకు దొరక్కుండా సన్నివేశాలు నడవవు. నెక్స్ట్ ఏం జరగనుందా? అనే ఆసక్తికి చోటు ఇవ్వకుండా దర్శకుడు ఈ కథను నడిపించాడు. అనిఖ సురేంద్రన్ నిన్న మొన్నటి వరకూ చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన అమ్మాయి. నటన పరంగా అనేక అవార్డులను సొంతం చేసుకున్న ఘనత ఆమె సొంతం. ‘బుట్టబొమ్మ’ అనే టైటిల్ ఆమెకి తగినదే. కాకపోతే ఆమె చుట్టూ అల్లిన కథ .. ఆమె చుట్టూ ఉంచిన పాత్రలకు పొంతన కుదరలేదు.
హీరో సూర్య వశిష్ఠకి నటన చాలా కృతకంగా ఉంది. ఆయనకీ .. అనిఖకి ఉన్న ఏజ్ గ్యాప్ కూడా ఆడియన్స్ ను ఇబ్బంది పెడుతుంది. ఇక అనిఖను పెళ్లి చేసుకోవాలనుకున్న చిన్నీ పాత్రధారి నటన కూడా చాలా వీక్ గా ఉంది. ఈ ఇద్దరూ కూడా అనిఖ నటన ముందు తేలిపోయారు. అనిఖ ఫ్రెండ్ బేబీ – ‘పుష్ప’ జగదీశ్ లవ్ సీన్స్ ద్వారా కూడా కామెడీని వర్కౌట్ చేయలేకపోయారు. ఇంటర్వెల్ లో అర్జున్ దాస్ ఎంట్రీ చూసిన తరువాత సెకాండాఫ్ పై ఆశలు చిగురిస్తాయి. కానీ ఆ తరువాత మళ్లీ మామూలే.
నిజానికి అర్జున్ దాస్ గొప్ప ఆర్టిస్ట్ .. ఆయన పాత్రను మరింత ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేసుకుని నడిపించవచ్చు. కానీ దర్శకుడు అలాంటి ప్రయత్నమేదీ చేయలేదు. ఇంటర్వెల్ తరువాత ప్రధానమైన పాత్రలు కలుసుకోవడం .. అప్పటివరకూ ఆడియన్స్ ను వెయిటింగులో పెట్టడం అసంతృప్తిని కలిగించే విషయాలు. మలయాళంలో వచ్చిన ‘కప్పేలా’ను చూసి దీనిని రీమేక్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇలాంటి కథలు కాస్త అటు ఇటుగా ఇంతకుముందు చాలానే వచ్చాయి.
ఈ సినిమాకి అనిఖ సురేంద్రన్ నటన ప్రత్యేకమైన ఆకర్షణగా కనిపిస్తుంది. ‘పేరులేని ఊరులోకి’ .. ‘అమ్మాడి గుమ్మాడి’ పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. బ్యాక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. వంశీ పచ్చిపులుసు ఫొటోగ్రఫీ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది. గణేశ్ కుమార్ రావూరి డైలాగ్స్ చెప్పుకునేంత గొప్పగా ఏమీలేవు. పెద్ద బ్యానర్ నుంచి రావడం వలన నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. ఒక సందేశమిచ్చే ప్రయత్నమైతే చేశారుగానీ, కథలో వైవిధ్యం .. కథనంలో బలం .. సరిగ్గా డిజైన్ చేయని పాత్రల వలన ఈ సినిమా ఆశించిన స్థాయిని అందుకోలేకపోయింది. నిడివి తక్కువే అయినా ఆడియన్స్ ను కదలకుండా కూర్చోబెట్టలేకపోయింది.