
- ముగిసిన దరఖాస్తు ప్రక్రియ
- 8,180 ఖాళీలు.. ఒక్కో పోస్టుకు 116 మంది పోటీ
- జులై 1వ తేదీన గ్రూప్4 పరీక్ష

తెలంగాణలో గ్రూప్–4 ఉద్యోగాలకు భారీ డిమాండ్ నెలకొంది. మొత్తం 8,180 ఖాళీలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. శుక్రవారం దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. 9,51,321 దరఖాస్తులు వచ్చాయని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రకటించింది. డిసెంబర్ 30 నుంచి ఫిబ్రవరి 2 వరకూ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగింది. టీఎస్ పీఎస్సీ ఊహించిన దానికంటే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. జనవరి 30తోనే దరఖాస్తు గడువు ముగియాల్సి ఉన్నప్పటికీ.. అభ్యర్థుల సౌలభ్యం కోసం ఫిబ్రవరి 3 వరకు పొడిగించారు. జనవరి 30న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల సంఖ్య 8,47,277కి చేరగా.. ఫిబ్రవరి 3 నాటికి దాదాపు మరో లక్ష మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు.
Follow us on Social Media
ఈ లెక్కన గ్రూప్4లో ఒక్కో పోస్టుకు 116 మంది పోటీపడుతున్నారు. కాగా, గ్రూప్– 4 పరీక్షను జులై 1వ తేదీన నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నట్లు కమిషన్ పేర్కొంది. ఇక, వివిధ సంక్షేమ శాఖల పరిధిలోని వార్డెన్లు, మాట్రిన్, సూపరింటెండెండ్ పోస్టులకు దరఖాస్తు గడువు కూడా ముగియగా 581 పోస్టులకు 1,45,358 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో పోస్టుకు 250 మంది పోటీ పడుతున్నారు. ఈ పరీక్ష ఆగస్టు నెలలో ఉంటుందని టీఎస్ పీఎస్సీ తెలిపింది.